రెవెన్యూ వ్యవస్థలో అవినీతి గురించి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు గల అభిప్రాయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవస్థలోని అవినీతిని నియంత్రించడానికి పలు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వీఆర్వోల వ్యవస్థను రద్దు చేశారు. అయినప్పటికీ రెవెన్యూ శాఖలో అవినీతికి అడ్డుకట్ట పడడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్వోల వంటి దిగువ స్థాయి సిబ్బందిపై వచ్చిన అవినీతి ఆరోపణల సంగతి ఎలా ఉన్నప్పటికీ, తహశీల్దార్ హోదాలో గల కొందరు అధికారులు సైతం నిరుపేదలను కూడా వదలకుండా ‘చిల్లర’కు కక్కుర్తి పడుతున్న తీరు సర్వత్రా చర్చకు దారి తీస్తోంది.
ముఖ్యంగా పేదింటి కుటుంబాల్లో పెళ్లిళ్లకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డిస్తున్న ఓ పథకంలో ‘ఎంగిలి విస్తరి’కోసం ఎగబడుతున్న చందాన వ్యవహరిస్తున్న ఓ తహశీల్దార్ ను ఏమని సంబోధించాలి? ఇదీ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న. వాస్తవానికి ఈ పథకంలో పేదలకు ప్రభుత్వం అందించేది లక్షా 116 రూపాయలు మాత్రమే. ఈ స్వల్ప మొత్తపు నగదుతో పేదింటి పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరుగుతాయనే భావన కాకపోవచ్చు. కానీ తమ పిల్లల పెళ్లిళ్లు కూడా చేయలేని స్థితిలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్న పేదలకు ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రజల ప్రశంసలను అందుకుంటున్నాయి. ఇందులో ఏ సందేహం లేదు.
కానీ ఇదే దశలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న లక్షా 116 రూపాయల నగదు పథకంలో రూ. అయిదు వేలకు, పది వేలకు కక్కుర్తి పడే తహశీల్దార్ల తీరును ఎలా వర్ణించాలనే ప్రశ్నలు ఉద్భవించడం సహజం. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ తహశీల్దార్ అచ్చంగా ‘ఎంగిలి విస్తరి’కి ఆశ పడిన చందంగానే పేదల పథకంలో ‘చిల్లర’ దండుకున్నట్లు ప్రభుత్వ విచారణలోనే తేలింది. ఇందుకోసం ముగ్గురు వ్యక్తులను బ్రోకర్లుగా నియమించుకున్నారట కూడా. వారిలో ఓ మాజీ ఎంపీపీ, మరో సర్పంచ్, ఇంకో వ్యక్తి ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులను బ్రోకర్లుగా ఏర్పాటు చేసుకున్న తహశీల్దార్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో పేదలకు దక్కాల్సిన మొత్తం నుంచి కొంత ‘చిల్లర’ నొక్కేస్తున్నారు
ధర్మసాగర్ తహశీల్దార్ పై ఆయనంటే గిట్టనివారెవరో చేస్తున్న ఆరోపణలు కూడా కావివి. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు విజిలెన్స్ విచారణలో వెలుగు చూసివ వాస్తవాలివి. కళ్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ పథకాల్లో ధర్మసాగర్ తహశీల్దార్ పేదల పథకానికి ఎలా కక్కుర్తి పడిందీ విజిలెన్స్ విభాగం తన నివేదికలో పూసగుచ్చినట్లు వివరిరించింది. ఈ వ్యవహారంలో లబ్ధిదారులు దరఖాస్తు సమర్పించే సమయంలోనే తహశీల్దార్ ‘చిల్లర’ ఏరుకునేవాడని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి దరఖాస్తుదారుని నుంచి రూ. 10 వేల చొప్పున వసూలు చేశాడని విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా ఉంది. ఇతనిపైనేగాక ఈ తరహాలో ‘చిల్లర’ వసూళ్లకు తెగబడిన మొత్తం 43 మంది రెవెన్యూ అధికారులపైన, సిబ్బందిపైన చర్య తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గత జూన్ 19వ తేదీన ఉత్తర్వు జారీ చేశారు.
కానీ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో పేదల నుంచి ‘చిల్లర’ వసూళ్లు చేసుకుంటున్న ధర్మసాగర్ తహశీల్దార్ పై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ యూనియన్ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ప్రచారంలో గల ఈ తహశీల్దార్ ‘చిల్లర’ వ్యవహారాలకు తెర దించే అవకాశమే లేదా? అని కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులే కాదు, స్థానిక ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. విజిలెన్స్ విభాగం సిఫారసు చేసినా, చీఫ్ సెక్రటరీ లేఖ రాసినా ఇతనిపై ఎటువంటి చర్య తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు లేకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేదింటి పెళ్లిళ్ల పథకం అమలు సందర్భంగా ‘చిల్లర’ ఏరుకుంటున్న ఈ తహశీల్దార్ ఆగడాలకు అడ్డుకడ్డ పడే రోజు కోసం స్థానిక ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.