విశాఖపట్నం రాజధాని కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే జూన్ నుంచి తన పరిపాలనను సాగించబోతున్నారా? అధికార వికేంద్రీకరణకు సంబంధించి, రాజధాని అంశంలో జీఎన్ రావు, బీసీజీ నివేదికల నేపథ్యం, వీటి అధ్యయనానికి నియమించిన హైపవర్ కమిటీ వ్యవహారాలు ఇక లాంఛనప్రాయమేనా? అమరావతి రాజధాని అంశంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలేవీ జగన్ ‘వికేంద్రీకరణ’ యోచనను మార్చే అవకాశాలే లేవా? ఔననే స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వచ్చే జూన్ నెల నుంచి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ కేంద్రంగా తన ప్రభుత్వ పాలనను నిర్వహించనున్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా రాజధానికి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన నివేదికలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన హైపవర్ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. అయితే కొందరు ముఖ్య సిబ్బందికి అనధికారికంగా ప్రభుత్వ పెద్దల నుంచి అందుతున్న ఆదేశాలు మాత్రం జగన్ పరిపాలన జూన్ నుంచి విశాఖ కేంద్రంగా సాగే అవకాశాలను స్పష్టంగా ప్రస్ఫుటింపజేస్తున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొందరు సిబ్బందికి విశాఖలో అద్దె ఇల్లు చూసుకోవాలని ఆదేశాలు అందడమే ఇందుకు ముఖ్య సంకేతంగా భావిస్తున్నారు. వచ్చే జూన్ కల్లా విశాఖలో నివాసం ఉండేందుకు, కుటుంబాన్ని తరలించేందుకు, పిల్లల చదువులకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేసుకోవలసిందిగా కొందరు ముఖ్య సిబ్బందికి అందిన అనధికార ఆదేశాల సారాంశం. ఈమేరకు సీఎం కార్యాలయంలోని కొందరు సిబ్బంది అప్పుడే విశాఖలో అద్దె ఇళ్ల వేటలో నిమగ్నం కావడం గమనార్హం. బహుషా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2వ తేదీకల్లా విశాఖ నుంచి జగన్ ప్రభుత్వ పాలన సాగే అవకాశాలున్నట్లు సమాచారం.