తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. తెలంగాణా, ఆంధప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏర్పడిన తాజా జల వివాదం విద్యుత్ పంచాయతీకి దారి తీస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన శ్రీశైలం ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీటిని నిలిపివేయాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం కృష్ణా రిజర్వాయర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) లేఖ రాసింది. ఈ లేఖకు స్పందిస్తూ, శ్రీశైలం ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి తక్షణమే నీటిని నిలిపివేయాలని కృష్ణా రిజర్వాయర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణా విద్యుత్ సంస్థలకు లేఖ రాసింది. ఇదే దశలో రాష్ట్రంలో గల జల విద్యుత్ కేంద్రాల ద్వారా నూరు శాతం విద్యుత్ ఉత్పత్తిని చేయాలని విద్యుత్ సంస్థలకు తెలంగాణా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణా టీఎస్ జెన్కో తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా జెన్కో వ్యవహరించకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. అయితే ఎన్నడూ లేని విధంగా తెలంగాణా విద్యుత్ ఉత్పత్తి అంశంలో ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాయడం చర్చకు దారి తీసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం నెలకొన్న పరిణామాల్లో నీటి విడుదల అంశంలో ఏపీ సర్కార్ కేఆర్ఎంబీకీ లేఖ రాయడం కయ్యానికి కాలు దువ్వుతున్న చందంగానే తెలంగాణా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయనేది వేచి చూడాల్సిందే. ఇందుకు సంబంధించిన ఆదేశాల ప్రతులను దిగువన చూడవచ్చు.