ఖమ్మం నగరంలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. సాగర్ కాల్వ వెంట పేద ప్రజలు నిర్మించుకున్న గుడిసెల తొలగింపు సందర్భంగా ఈ వాతావరణం అలుముకుంది. ఖమ్మంలోని మమత హాస్పిటల్, హార్వెస్ట్ స్కూల్ సమీపాన గల సాగర్ కాల్వపై పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ఈ గుడిసెలను తొలగించేందుకు శుక్రవారం పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు ఉద్యుక్తమయ్యారు. అయితే గుడిసెల తొలగింపునకు అందులో నివసిస్తున్న పేదలు నిరాకరించారు.
దీంతో రెవెన్యూ అధికారులు జేసీబీ వాహనాలతో నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట దృశ్యాలతో ఉద్రిక్తత నెలకొంది. పేదలకు మద్ధతుగా బీజేపీ నేతలు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, డాక్టర్ శీలం పాపారావు తదితరులు అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా గుడిసెల తొలగింపును అడ్డుకున్నవారితోపాటు బీజేపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన కొన్ని చిత్రాలను దిగువన చూడవచ్చు.