మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తనను హెచ్చరించడంపై ఆ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జీనుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న స్పందించారు. ఈమేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మావోయిస్ట్ పార్టీ అభయ్ పేరున జూన్ 18 వ తేదీన విడుదల అయిన ప్రకటనలో తనపై హేళనలతో, నిరాధార ఆరోపణలతో, అప్రజాస్వామికంగా, హెచ్చరికలతో కూడిన దాడిని ఖండిస్తున్నట్లు జంపన్న చెప్పారు. అభయ్ పేరుతో ఇచ్చిన ప్రకటన వారిదా? కాదా? అనే సంశయం, క్లారిటీ కానీ స్థితిలో జవాబు రాస్తున్నట్లు జంపనన్న పేర్కొన్నారు.
అభయ్ పేరుతో విడుదలైన ప్రకటనలో తనను ఉద్ధేశిస్తూ, “విప్లవ రాజకీయాల నుండి హీనాతి హీనంగా దిగజారి పోయిన జంపన్నకు విప్లవ రాజకీయాలపై, మా పార్టీపై మాట్లాడటానికి కనీస నైతిక అర్హత కూడా లేదని మా పార్టీ ఈ సందర్భంగా మరో సారి స్పష్టం చేస్తోంది. మాజీ మావోయిస్టుగా అవతారమెత్తిన జంపన్న చీటికి మాటికీ పోలీసుల కథనాలకు వంత పాడుతూ మీడియా ముందు ప్రత్యక్షం కావడం ఆయనకు మంచిది కాదని కూడా హెచ్చరిస్తున్నాం.” అని వ్యాఖ్యలు చేశారని జంపన్న గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అభయ్ ఫత్వాకు తాను జవాబు ఇస్తున్నట్లు జంపన్న చెప్పారు. ఈ విషయంలో జంపన్న ఏమంటున్నారో ఆయన మాటల్లోనే….
అభయ్ ఫత్వాకు నా జవాబు:
‘’నేను నేర్చుకున్న సైద్ధాంతిక రాజకీయ అవగాహన, ఉద్యమ పాఠాలు నా వర్గ దృక్పథం, మొదటి నుండి విమర్శనాత్మకంగా ఉండే నా స్వేచ్ఛాయుత మైన దృక్పథంతో మాత్రమే గత రెండేళ్ళకు పైగా ఇంటర్వ్యూ లు, సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు. జంపన్న ఇంటర్వ్యూ ల్లో, కామెంట్లలో మావోయిస్ట్ ఉద్యమంపై మాత్రమే కాకుండా వివిధ సామాజిక రాజకీయ సమస్యల పై, వివిధ ప్రముఖ ఘటనలపై, వివిధ పార్టీల వైఖరులపై ,అప్రజాస్వామిక చర్యలపైన అనేకం ఉన్నాయి. వీటిపై వీక్షకులు పాఠకులు గమనిస్తూ తమ స్పందనలు తెలియ చేస్తున్నారు. వీరెవ్వరికి జంపన్న పోలీసులకు వంత పాడుతున్న విషయం దృష్టి కి రాలేదు.
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీకి తప్పుగా అర్థం అవుతున్నప్పుడు ప్రజాస్వామిక పద్దతిలో ఎత్తి చూపవచ్చు, విమర్శ చేయవచ్చు .వివిధ పార్టీల రాజకీయాలపై అనేక మంది అనేక రకాలుగా వ్యాఖ్యానించడం, మావోయిస్ట్ పార్టీని సైతం విమర్శించడం సమాజంలో సాధారణంగా జరుగుతున్నదే. విమర్శలకు, వ్యాఖ్యానాలకు జవాబులు వుంటాయి.., ప్రతి వ్యాఖ్యానాలు వుంటాయి. కానీ అభయ్ ప్రకటనలో బెదిరింపులు, నిషేధాలు, ముద్రలు వున్నాయి. ఇది ప్రజా స్వామిక అవగాహన కాదు నియంతృత్వ పోకడ మాత్రమే అవుతుంది. మీరు నాపై ఇచ్చిన ప్రకటనకు సాధారణ ప్రజల్లో గానీ ప్రజాస్వామిక వాదుల్లోగానీ, విప్లవాభిమానుల్లో గానీ మద్దతు లేదు. ఆశ్చర్యంతో కూడిన వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
నూరు పూలు, వేయి ఆలోచనలతో భావాలు సంఘర్షించాలనే గొప్ప సూక్తిని నిజ జీవితంలో ఎత్తి పట్టండి. నూతన ప్రజాస్వామ్యం అనే వారు ప్రజాస్వామ్యం ఆచరించి ఆదర్శం కండి. నా ఇంటర్వ్యూ ల్లో వివిధ సోషల్ మీడియా కామెంట్లలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అనేక విషయాల్లో స్పష్టీకరణ తో కూడిన విషయాలు మాత్రమే ప్రధానమైనవి. విధాన పరమైన విషయానికి వస్తే… భారత సమాజం నేడు భూస్వామ్య వ్యవస్థ ఆధిపత్య స్థానంలో లేదని, పెట్టుబడి వ్యవస్థ మాత్రమే ఆధిపత్య స్థానంలో, నిర్ణయాత్మక స్థానం లో వుందని, దానికి తగిన విధంగా తమ లైన్ మార్చు కోవాలని వివిధ ఇంటర్వ్యూ ల్లో చెప్పాను. అర్ధ భూస్వామ్యం ఉందని భావించే వివిధ పార్టీలు కూడా దేశంలో వున్నాయి. నేను మాట్లాడే విషయం వారికి కూడా వర్తిస్తుంది.సైద్ధాంతిక విమర్శ లకు సైద్ధాంతిక జవాబు మాత్రమే తోడ్పడుతుంది. సైద్ధాంతికమైన విభేదాలు ప్రజాస్వామిక పద్దతిలో చర్చ ద్వారానే కానీ హేళనతో, ఛీప్ కామెంట్లతో, పరుష పదజాలంతో, శత్రు పూరితంగా చూసే వైఖరి మిత్రులను దూరం కొట్టేదే. తమను తాము ఒంటరి చేసుకునేది మాత్రమే అవుతుంది.
ఒక పార్టీని విడిచిపెట్టినంత మాత్రాన తదనంతరం రాజ్యంతో, వారి వైఖరితో సంబంధం లేకుండా, లేదా పైపై విషయాలపై ఆధారపడి ద్రోహులు అనడం పూర్తిగా సెక్టేరియన్ జడ్జిమెంట్ (ఏకపక్ష తీర్పు) మాత్రమే. ఆయుధాలు పట్టుకొని త్యాగాలు చేసినంత మాత్రాన ఇష్టానుసారమైన, సంకుచిత మొరటు తీర్పులు ఇవ్వడం మార్క్సిజం కాదు. ప్రజా పంథా కాదు. అర్థం చేసుకోవడంలో వున్న భ్రమలు,…పై పై విశ్లేషణ తప్పుడు నిర్ణయాలకు కారణమవుతుంది. పిడివాద, మూస, రొడ్డ కొట్టుడు పదజాలం పనికి రాని కొలతలు, ప్రజలను, మిత్రులను ఐక్యం చేయకుండా దూరం కొట్టడానికి మాత్రమే ఉపయోగ పడుతుంది. ఈలాంటి పద్దతులను ప్రజలు, మిత్రులు వ్యతిరేకిస్తున్న పరిస్థితిని లోతుగా సమీక్షించుకోవాలి.
గత మీ ఘనమైన ఉద్యమ చరిత్ర పలితంగా, ఇప్పటికీ మీరు చేస్తున్న త్యాగాలకు నేటి సమాజంలో మీకు గొప్ప స్థానం ఇప్పటికీ వుంది. కానీ దేశంలో అనేకమైన ప్రజా సమస్యల పరిష్కారానికి గత రెండు దశాబ్దాలకుపైగా మీ కార్యాచరణ ఏమీలేక, విశాల ప్రజా రాశులకు దూరమైన విషయం గత కొన్ని సంవత్సరాలుగా మీకు అర్థం అవుతున్నప్పటికీ, వాటిని దాటవేస్తూ కాలం గడపడం భారత పీడిత ప్రజలను నిరాశపరుస్తున్నది.
నేడు దేశంలో సకల సమస్యలకు మూల కారణమైన పెట్టుబడిదారీ వ్యవస్థ అంతానికి మీ శక్తి యుక్తులతో నిజమైన ప్రజాదాడి ని ఎక్కుపెట్టండి. నిజమైన శత్రువులను గుర్తించి వేరు చేయండి. అన్నిరకాల మిత్రులతో కలిసి నడవండి. విశాల ప్రజలకు నాయకత్వం అభివృద్ది చేయండి. కాలం చెల్లిన పాత పోరాట నిర్మాణ రూపాలతో కాకుండా దేశంలో జరుగుతున్న ప్రజా ఉద్యమాలతో మమేకం కండి. విశాలమైన ప్రజా ఉద్యమం నిర్మించడానికి కలిసి వచ్చే మిత్రుల కోసం కేంద్రీకరించండి.’’ అని జంపన్న తన ప్రకటనలో మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ కు హితవు చెప్పారు.