మల్లన్నసాగర్ ముంపు గ్రామ బాధితుని విషాద ఉదంతమిది. సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన వేములగట్టుకు చెందిన తట్టుకోరి మల్లారెడ్డి (70) అనే వృద్ధుడు చితిపేర్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు గజ్వేల్ లో నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలో అధికారులు తనకు ఇల్లు కేటాయించలేదనే మనస్తాపంతో మల్లారెడ్డి ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
గజ్వేల్ లో ఇల్లు కేటాయించకపోవడం, వేములగట్టులో కూల్చివేసిన ఇల్లును కూడా ఖాళీ చేయాలని ఒత్తిళ్లు రావడంతో, తాను ఎక్కడికి వెళ్లాలో తెలియక, మనోవేదనకు గురైన మల్లారెడ్డి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. గురువారం అర్థారాత్రి దాాటాక తానే స్వయంగా చితి పేర్చుకుని శుక్రవారం తెల్లవారుజామున తనకుతాను స్వయంగా నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కాగా సంఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. ఇంటి ఆవరణలోనే మల్లారెడ్డి ఆత్మహత్యకు గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. చితిలో మిగిలిన మల్లారెడ్డి శరీర భాగాలను పోస్టుమార్టం కోసం పంపిస్తున్నారు. మల్లారెడ్డి ఆత్మహత్యోదంతం తీవ్ర కలకలానికి దారి తీసింది.