కరోనా కేసుల నమోదులో గడచిన వారం ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొత్తం పది జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతుండగా, అందులో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానాన్ని ఆక్రమించడం ఆందోళనకర పరిణామంగా వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత నెల… అంటే మే 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధికంగా 3,645 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డిలో 1,449, మేడ్చల్ జిల్లాలో 1,373 కేసులు నమోదయ్యాయి. రాజధాని నగరం, అక్కడి జనాభా, పరిసర జిల్లాలు అనే ప్రామాణికంగా ఆదినుంచీ ఇక్కడ కేసులు భారీగానే నమోదవుతున్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.
కానీ జిల్లాల వారీగా పరిశీలిస్తే గడచిన వారంలో కరోనా కేసుల ఉధృతి గల పది జిల్లాల్లో ఖమ్మం ప్రథమ స్థానాన్ని ఆక్రమించడం గమనార్హం. జిల్లాల వారీగా నమోదైన ప్రకారం ఖమ్మంలో 1,492, నల్లగొండలో 1,429, కరీంనగర్ లో 1,209, సూర్యాపేటలో 1,029, పెద్దపల్లిలో 962, భద్రాద్రి కొత్తగూడెంలో 922, వరంగల్ నగరంలో 913, మహబూబ్ నగర్ లో 885, సిద్ధిపేటలో 865, మహబూబాబాద్ లో 844 చొప్పున గత వారంలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో కరోనా కేసుల ఉధృతి తీవ్రంగా గల జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షించేందుకు ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈమేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావులు మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.