మహబూబాాబాద్ జిల్లాలో సంచలనానికి దారి తీసిన గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం, ఆ తర్వాత హత్యోదంతపు మిస్టరీ వీడింది. ప్రేమికుడే మైనర్ బాలికను నమ్మించి రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి, అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘోర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మానుకోట ఎస్సీ నంద్యాల కోటిరెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో వివరించారు. ఆయన కథనం ప్రకారం…
మరిపెడ మండలం తండా ధర్మారానికి చెందిన ధరంసోత్ రాజేష్ (22) అనే యువకుడు సమీప తండాకు చెందిన ఓ గిరిజన మైనర్ బాలిక మధ్య పరిచయం ఉంది. గడచిన మూడు నెలలుగా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా చనువుకు దారి తీసింది. అప్పుడప్పుడు ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండేవారు. వాస్తవానికి బాధిత మైనర్ బాలికను ఆమె పెద్దనాన్న పెంచుతున్నాడు. ఈ కుటుంబానికి చెందిన చిన్న డబ్బా కొట్టు ఒకటి తండా సమీపంలోని పెట్రోల్ బంకు ముందు నిర్వహిస్తుండేవారు. ఈ క్రమంలోనే రాజేష్ అక్కడకొచ్చి అప్పుడప్పుడు మైనర్ బాలికతో మాట్లాడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే మైనర్ బాలికను ఒంటరిగా బయట ఎక్కడైనా కలుద్దామని రాజేష్ తరచూ అడుగుతూ ఉండేవాడు.
ఇదే దశలో తాను తండా ధర్మారానికి చెందిన ధర్మసోత్ రాజేష్ అనే వ్యక్తిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలిక తన అక్కతో చెప్పగా, ‘ముందు నువ్వు చదువుకో… నీది చిన్న వయస్సు’ అని తిరస్కరిస్తూ ఆమె మందలించింది. ఆ తర్వాత తన పెదనాన్న కొడుకు మోహన్ అతని సొంత అక్కకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్ లో ట్రీట్మెంట్ కొరకు 27వ తేదీన వెళ్లారు. ఈ విషయాన్ని మైనర్ బాలిక రాజేష్ కి చెప్పింది. ఇదే అదునుగా రాజేష్ నిన్న సుమారు 12.00 గంటల సమయంలో మైనర్ బాలికతో ఫోన్లో మాట్లాడి, మీ ఇంట్లో ఎవరు లేరు కదా? మనిద్దరం కలుద్దాం’ అని ఆమెను ఒప్పించాడు. ఈమేరకు బాలికను తమ ఇంటికి దగ్గర్లో ఉండే మొండికట్టు బోడు(గుట్ట) కు రావాలని రాజేష్ చెప్పగా తను అక్కడికి నడుచుకుంటూ వచ్చింది. ఇదే సమయంలో రాజేష్ తన ద్విచక్ర వాహనం మీద పెట్రోల్ బంకుకు చేరుకున్నాడు. అనంతరం అక్కడ పెట్రోల్ బంకులో పని చేసే కోటి అనే వ్యక్తితో ‘నా బైక్ వేపచెట్టు కింద పెట్టి మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్తాను’ అని చెప్పిన రాజేష్ రోడ్డు దాటి గుట్ట వైపునకు వెళ్ళాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న బాలికతో కలిసి ఇద్దరూ గుట్టపైకి వెళ్లి ఓ బండరాయి మీద కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇదే సందర్భంగా శారీరకంగా కలుద్దామని రాజేష్ మైనర్ బాలికను కోరగా, తనకు భయమేస్తున్నదని, తాను ఎప్పుడూ అలా చెయ్యలేదని బాలిక చెప్పింది. కానీ రాజేష్ బాలికపై అత్యాచారం చేస్తుండగా, ‘నన్ను వదిలేయ్…’ అని బాలిక ప్రాధేయపడినా వినకుండా ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సందర్భంగా మైనర్ బాలిక తల బండరాయికి బలంగా తగలడంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావమైంది. ఇదేమీ పట్టించుకోని రాజేష్ బాలికపై అత్యాచారం చేయగా ఆమె స్పృహ కోల్పోయింది.
ఆ తర్వాత రాజేష్ ఇదే విషయాన్ని శ్రీను అనే వ్యక్తికి ఫోన్ చేసి చెప్పాడు. శ్రీను బాలిక సొంత బావ శంకర్ కి విషయాన్ని ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే అక్కడకు వచ్చి శ్రీను. శంకర్ లు బండిపై పురుషోత్తమాయగూడెంలోని ఆర్ఎంపీ వైద్యుడు కళాధర్ వద్దకు బాలికను తీసుకువెళ్లి చూపించగా, ఆమె చనిపోయినట్లుగా ఆర్ఎంపీ చెప్పారు. ఘటనానంతరం నిందితుడు రాజేష్ పరారీలో ఉండగా పక్కా సమాచారంతో ఎల్లారిగూడెం స్టేజ్ వద్ద అతన్ని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరించారు.
ఫొటో: ఘటన గురించి మీడియాకు వివరిస్తున్న ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి