అనుభవంలో ఆయుష్షు
అరిటాకు ముల్లై
హృదయంలో సూటిగా
గుచ్చుకుంటున్నప్పుడు
ఆలోచనలను
అవసరార్థమైనా
అవలోకనం చేయకతప్పదు
అడుగుముందుకు
వేయడం
అత్యంత అవసరం గదా మిత్రమా!
ప్రాణాలు గాలిలో దీపాలైనపుడు
గుడ్డిదీపం వెలుగులో
చిలుక్కొయ్యకు వేలాడే
ప్రాణవాయువు సిలిండరులో
ఉక్కిరిబిక్కిరయ్యే లెక్కలేనన్ని
దిక్కులేని ప్రాణులు
అరచేతిలో ఊపిరి ఉగ్గబట్టుకునే
అల్ప జీవులు
కట్టలపాములు చుట్టూ పెట్టిన
పుట్టలతో కట్టిన వైద్యకోటలు
కట్టుబాటులేని నిషాలో
బుసలుకొట్టే విషసెలైన్లు
వ్యాక్సీనూ కూడా బొక్కసం నింపే వ్యాపారమైనచోట
కట్టలుతెగిన దుఃఖ జలపాతాలకు
అభి’మతం’
అడ్డుకట్టలెలా వేయగలదు?
కాలేకట్టెల చితుల నుంచి ఎగిసే
దట్టమైన పొగలు పీల్చే
కమురువాసనల ముక్కుపుటాలు
దిక్కుతోచని స్మశానంలో
కుప్పకూలిన నిప్పుల మోపు
మిగిలే చాటెడు బూడిదలో
గురిగెడు బొమికల స్మృతులు
ఆరడుగుల నేలకు అంకితమయ్యే సమాధులు
మట్టిలో కలిసిపోయే మమకారం
కాసిన్ని జ్ఞాపకాల గాయాల పైన పూసిన లేపనాల నడుమ
వికసిచించే సువాసనలు
పిట్టకూడా ముట్టని కాలని కట్టెలో
శిథిలమైన జీవన వైవిధ్య కథలెన్నో!?
ఒక్కటా రెండా
లెక్కలేనన్ని ఉంటే? లెక్కలెలా చెప్పగలను.
నా దేశ దేహ నాడీమండలమంతా
అలజడే
కన్నీటి కంపు గంగా ప్రవాహాం
ప్రశాంతంగా
నిదుర పట్టేందుకు మనమేమైనా పాలకులమా..?
శవాల గుట్టల్లో ఫిడేలు వాయించగల నేర్పరులమా!?
బాధను కూడా వ్యక్తంచేయలేని అభాగ్యులం
ప్రశ్నించడానికి సైతం
వెనుకా ముందాడే సగటు పిరికి మందలం
✍️ రవి ® సంగోజు