చారాణా కోడికి బారాణా మసాలా అంటే ఇదే!
తెలంగాణాలో మినీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు గత నెల 30న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఓట్లర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు పడరాని పాట్లు పడుతుటారనేది కూడా అందరికీ తెలిసిందే. డబ్బు, మద్యం పంపిణీతోపాటు ఇతరత్రా బహుమతుల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంటారు. ఇదంతా జగద్విత విషయమే. కానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో కూడా పలు చోట్ల ఓటుకు రూ. 1,000 నుంచి 2,000 వేలు, మరికొన్ని చోట్ల 2,500 వరకు కూడా నగదు పంపిణీ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇక్కడే ఓ పంపిణీ ‘కత’ గురించి చెప్పుకుందాం.
ఖమ్మం నగరపాలక సంస్థలోని 20వ డివిజన్ లో మొత్తం 5,122 ఓట్లు ఉన్నాయి. ఇందులో కేవలం 1,591 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే అధికారిక లెక్కల ప్రకారం పోలింగ్ 31.06 శాతం మాత్రమే. ఇక్కడ ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఓటుకు రూ. 2,000 చొప్పున నాలుగు వేల మంది ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన రూ. 40.00 లక్షల మొత్తాన్ని కేవలం ఓటర్లకే పంపిణీ చేసినట్లు భావించాలి. మిగతా ప్రచార ఖర్చులు, కార్యకర్తల తిండీ, తిప్పల లెక్కలు వేరే. మొత్తంగా కనిష్టంగా దాదాపు రూ. 50.00 లక్షల వరకు ఇక్కడ ఆయా పార్టీ అభ్యర్థి ఖర్చు చేశారని పలువురు భావిస్తున్నారు. అయితే పోలైన 1,591 ఓట్లలో కనీసం 600 వందల ఓట్లు లభిస్తే తప్ప ఇక్కడ కార్పొరేటర్ గా నగదు పంపిణీ చేసిన అభ్యర్థి విజయం సాధించే అవకాశం లేదు. ఈ ప్రాతిపదికన ఇక్కడ ప్రతి ఓటు ఖరీదు ఎంతో అంచనా వేసుకోవచ్చు. అంతేకాదు కనీసం తాను పంపిణీ చేసిన నగదు ప్రామాణికంగా ఓట్లు పోల్ కాకపోవడం, జయాపజయాలపై ఆయా పార్టీ అభ్యర్థి తీవ్ర గుబులతో ఉన్నారట. కాగా గత ఎన్నికల్లోనూ రూ. 30 నుంచి అరకోటి వరకు ఖర్చుచేసి విజయం సాధించిన కార్పొరేటర్లలో కొందరు ఆర్థికంగా దివాళా తీశారు. ఒకరిద్దరైతే ఖమ్మం నగరం నుంచే పారిపోయిన చరిత్ర ఉంది. అదీ అసలు సంగతి.