తెలంగాణాలోని నిరుద్యోగులకు ఇది శుభవార్త. రాష్ట్రంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు బిల్లు, మాజీ ప్రజాప్రతినిధుల పెన్షన్ పెంపు బిల్లులను శాసన సభ ఆమోదించింది. కనీస పెన్షన్ రూ. 50 వేలు కాగా, గరిష్ట పెన్షన్ రూ. 70 వేలకు పెంచుతూ శాసనసభ ఆమోదం తెలిపింది. ఒకటి, రెండు, మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేల పెన్షన్ గతంలో రూ. 30 వేలు కాగా, ఈ మొత్తాన్ని రూ. 50 వేలకు పెంచారు. మూడు సార్లు అంతకుమించి గెలిచిన సభ్యుల పెన్షన్ను రూ. 50 వేల నుంచి 70వేల మొత్తానికి పెంచారు. ఇక పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంపు బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఉద్యోగుల అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అందరి సంప్రదింపులతోనే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని, ఉద్యోగాల భర్తీ విషయంలో ఇది అడ్డంకి కాదని మంత్రి చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో వెనువెంటనే 50 వేల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారని, ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు వివరించారు.