వసంతరావు కుట్ర… కుంట శీను కత్తి!
సంచలనం కలిగించిన న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్యోదంతంలో ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కుట్ర ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అడ్వకేట్స్ దంపతుల హత్యోదంతంలో ఏ1గా పోలీసులు ప్రస్తావించిన వెల్ది వసంతరావు అనే వ్యక్తి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా తెలుస్తోంది. గుంజపడుగు గ్రామానికే చెందిన ఈయన గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు డివిజనల్ ఇంజనీర్ గా పనిచేసినట్లు చెబుతున్నారు. నిన్న దారుణ హత్యకు గురైన న్యాయవాద దంపతుల కేసుకు సంబంధించి మంథని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో రామగిరి పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో ఏ1గా వెల్ది వసంతరావును పేర్కొన్న పోలీసులు అతని పూర్తి వివరాలేవీ పొందుపర్చకపోవడం గమనార్హం. అదేవిధంగా ఏ2గా కుంట శ్రీనివాస్, ఏ3గా అక్కపాక కుమార్ పేర్లను నమోదు చేశారు. గట్టు కిషన్ రావు (74) అనే వ్యక్తి ఇచ్చి ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం మేరకు ఆయా పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అడ్వకేట్ దంపతుల హత్యకు ఏ1 వెల్ది వసంతరావు పథక రచన చేయగా, ఏ2 కుంట శ్రీనివాస్, ఏ3 అక్కపాక కుమార్ లు ఘటనా స్థలంలో వామన్ రావును, అతని భార్య నాగమణిని నరికి చంపినట్లు వివరించారు.
పోలీసులు కోర్టులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం… నిన్న మధ్యాహ్నం 2.40 గంటల ప్రాంతంలో రామగిరి మండలం కల్వచర్ల గ్రామ శివార్లలో ఈ హత్యలు జరిగాయి. న్యాయవాదులు వామన్ రావు, నాగమణిల జంట మంథనిలో కోర్టు పనులు పూర్తి చేసుకుని తమ క్రెటా కారులో హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్నారు. కల్వచర్ల శివార్లలోకి రాగానే అడ్వకేట్ దంపతులు ప్రయాణిస్తున్న కారును కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ లు అటకాయించి వేట కొడవళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితులను పెద్దపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. గుంజపడుగు గ్రామంలో నిర్మిస్తున్న పెద్దమ్మ టెంపుల్, కుంట శ్రీనివాస్ అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణం వ్యక్తిగత కక్షలకు దారి తీసిందని, చివరికి ఈ ఘటనకు దారి తీసిందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో నివేదించారు. నిందితులపై ఐపీసీ 120బి, 341, 302, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయా సెక్షన్లలో 34 కీలకంగా భావించవచ్చు. ఈ హత్యలకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తులో మరెవరి పేర్లయినా వెల్లడైతే నమోదు చేసేందుకు 34 సెక్షన్ దోహదపడుతుంది.