చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, మన ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకుంటే అంతర్జాతీయ రాజకీయ అంశాలను విశ్లేషించవచ్చు.
తెలంగాణా సీఎం కేసీఆర్ దేశ ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులను కలిసి శాలువాలు కప్పి, నమస్కరించి వచ్చిన దృశ్యంపై ఎవరికి తోచిన కథనాలను వారు అల్లేసుకోవచ్చు.
చివరికి కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కలిస్తే కూడా ఊహాజనిత వార్తా కథనాలు ఎన్నయినా రాసేసుకోవచ్చు.
కానీ ఖమ్మం జిల్లాలో ఒకే పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నేతల కలయిక మాత్రం నిరంతరం ఓ పసందైన దృశ్యం. ఔను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ కలుసుకున్నారు. ఎందుకో తెలుసా? అది తెలుసుకోవాలంటే ముందు కొన్ని పాత విషయాలను చెప్పుకోవాలి.
టీఆర్ఎస్ జిల్లా ఆఫీసులో ఆ మధ్య తుమ్మల నాగేశ్వరరావు ఫొటోను తీసేశారనే అంశంపై వివాదం నెలకొంది. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా ఒకే పార్టీకి చెందిన నాయకులు రచ్చ, రచ్చగా పోస్టులు పెట్టేసుకున్నారు.
తనపై సోషల్ మీడియాలో అనుచితంగా దాడి జరుగుతోందని, తనను బద్నాం చేస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు తొలిసారి 2019 డిసెంబర్ 31న పోలీసులను ఆశ్రయించారు. అప్పట్లో తుమ్మల చేసిన ఈ ఫిర్యాదుపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారనేది వేరే విషయం.
మంత్రి పువ్వాడ అజయ్ ను, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావుల మధ్య రాజకీయ సయోధ్య కుదిర్చేందుకు ఎంపీ నామా నాగేశ్వరరావు ఆ మధ్య ఓ ప్రయత్నం చేశారు.
ఈ నేపథ్యంలోనే మంత్రి అజయ్ కుమార్ ఇటీవలే తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లి, ఆయనకు ప్రణమిల్లి కలుసుకున్న దృశ్యం అధికార పార్టీ కార్యకర్తల్లో మహా సంబురాన్ని కలిగించింది.
కానీ ఆ సంబురం ఎంతో కాలం నిలవలేదు. సీన్ మళ్లీ మొదటికొచ్చింది. తాను బీజేపీలోకి వెడుతున్నట్లు కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఇది తన ప్రతిష్టకు భంగకరంగా పరిణమించిందని తుమ్మల నాగేశ్వరరావు మరోసారి పోలీసులను ఆశ్రయించారు.
తొలిసారి తన అనుయాయుల చేత పోలీసులకు ఫిర్యాదు పంపిన తుమ్మల, రెండోసారి తానే స్వయంగా వెళ్లి పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గత నవంబర్ 18న తుమ్మల చేసిన ఫిర్యాదులో మంత్రి అజయ్ అనుచరగణంగా ప్రాచుర్యం పొందిన కొందరు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారనేది కూడా అప్రస్తుతం.
కానీ తాజాగా మరో రసవత్తర సీన్ కనిపించింది. మంత్రి అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు మళ్లీ తుమ్మలను కలుసుకున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయా నేతలు ఆ పక్కనే గల దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తుమ్మల నివాసానికి వెళ్లి కాసేపు ముచ్చటించుకున్నారు.
ఇంకేముంది? మళ్లీ రాజకీయ సమీకరణలపై మీడియాలో ఊహాగానాలు. సామాజిక రాజకీయ పునరేకీకరణ జరుగుతోందనే ప్రచారం. కానీ ఇది ఎంతకాలం నిలుస్తుంది? ఇదీ అసలు సందేహం. వాస్తవానికి ఈ నేతలు మనస్ఫూర్తిగా కలిసి ఉంటే గులాబీ పార్టీ కేడర్ కు నిజమైన పండగే. అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు.
కానీ గత ఘటనలు చెబుతున్నదేమిటి? అందుకే మోదీ, జిన్ పింగ్ ల కలయికనూ అంచనావేయవచ్చు. కేసీఆర్, అమిత్ షాల కలయికపైనా వార్తలు వండేసుకోవచ్చు. కానీ ఖమ్మం జిల్లా రాజకీయ నేతల నిరంతర కలియక దృశ్యాలను అంత ఈజీగా పసిగట్టలేం.., అర్థం చేసుకోలేం కూడా. ఇది నిరంతర కలయిక, అంతరాల అగాధం మాత్రం ఎక్కడికక్కడే. ఇంతకు మించి ఈ ‘రాజకీయం’ అర్థమేంటో, పరమార్థమేంటో మీకు బోధపడితే కాస్త చెప్పండి ప్లీజ్! అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఫొటోలోని నేతల హావభావాలను మరోసారి తీక్షణంగా చూడాల్సిందే మరి!!