‘నీళ్ల టీకా’ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఆక్స్ ఫర్డ్, మోడర్నా, ఫైజర్ వ్యాక్సిన్లు మినహా మిగతావి ‘నీళ్లంత’ సురక్షితమైనవిగా అభివర్ణిస్తూ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా స్పందించిన సంగతి తెలిసిందే. ఓ శాస్త్రవేత్తగా ఆ వ్యాఖ్యలు తననెంతో బాధకు గురి చేశాయని, ఇండియన్ కంపెనీ కాబట్టే తమపై ఇన్ని విమర్శలను ఆయన ఆవేదన చెందారు. అయితే ఈ వ్యాఖ్యల వివాదానికి మంగళవారం ఫుల్ స్టాప్ చెబుతూ సీరం, భారత్ బయోటెక్ సంస్థలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం విశేషం.
కరోనా వైరస్ టీకాపై తమలో విభేదాల్లేవని, కలిసి కట్టుగా ఈ ప్రాజెక్టుపై కృషి చేయాలన్న అవగాహనకు వచ్చామని సీరం, భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి. ఈమేరకు సీరం సీఈఓ అదర్ పూనావాలా, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ప్రజల ఆరోగ్యాన్ని, వారి జీవితాలను పరిరక్షించడమే తమకు ప్రధానమని, ప్రమాణం కూడా చేస్తున్నామన్నారు. ఈ దేశానికి, ప్రపంచానికి కూడా తమ వ్యాక్సిన్లను అందజేయడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. టీకా మందుల ఉత్పత్తి, సప్లయ్ విషయంలో వేర్వేరుగా కాకుండా కలిసి సహకరించుకుంటామని పేర్కొన్నారు.