జమిలి ఎన్నికల నిర్వహణపై సంకేతాలు వెలువడుతున్నాయా? కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంసిద్ధమైనట్లేనా? కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా చేసిన ప్రకటన ఇవే సందేహాలను రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించడం గమనార్హం. ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ అరోరా మాట్లాడుతూ, జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే కొన్ని చట్ట సవరణలు అవసరమని వ్యాఖ్యానించారు.
జమిలి ఎన్నికల నిర్వహణపై డైరెక్టుగా నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి లేదని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ జమిలి ఎన్నికల అంశాన్ని ఇటీవల ప్రస్తావించిన నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా చేసిన వ్యాఖ్యలు సహజంగానే ప్రధాన్యతను సంతరించుకున్నాయి.