హమ్మయ్య… రేగా కాంతారావు అటవీ శాఖ అధికారులను కనికరించారు. ఔను… ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అటవీ అధికారులను కాస్త కనికరించినట్లు కనిపిస్తోంది. తాను హైదరాబాద్ నుంచి రాగానే అటవీ అధికారులతో ప్రత్యక్ష యుద్ధమని, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు సిద్ధంగా ఉండాలని, అటవీ శాఖతో అమీ, తుమీ తేల్చుకుందామని కాంతారావు పిలుపునిచ్చారు. గ్రామాల్లోకి వచ్చే అటవీ అధికారులను నిర్బంధించాలని కూడా ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విప్ హోదాలో రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా వార్తాంశంగా మారాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు అన్ లైన్ మీడియా, సోషల్ మీడియా కూడా కాంతారావు వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే కాంతారావు సాధారణ ఎమ్మెల్యే కాదు. సాక్షాత్తూ ప్రభుత్వ విప్. దీంతో సహజంగానే ఆయన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రకటించిన ప్రకారం ఈనెల 18, 19 తేదీల్లో ఆయన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పినపాక నియోజకవర్గంలో ప్రకటించారు. పర్యటన తేదీల్లో ముందు రోజు అశ్వాపురంలో, తదుపరి రోజు మణుగూరు మండలంలో పర్యటించారు డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతువేదిక ప్రారంభోత్సవ, తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మణుగూరులో నిర్వహించిన ఓ ప్రత్యేక సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశా, నిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే ప్రతి కార్యకర్త పార్టీకోసం సైనికుల్లా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. శనివారం రాత్రి పొద్దుపోయాక తన ఫేస్ బుక్ ఖాతాలో రేగా కాంతారావు మరో రెండు పోస్టులు పెట్టారు. పోడు భూముల విషయంలో నిర్లక్ష్యం చేస్తే బతుకులు ఆగమేనని, పిడికిలి బిగించాలని మళ్లీ పిలుపునిచ్చారు. ఆ తర్వాత మరో గంటకు చేసిన ఇంకో పోస్టులో ‘పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కేటీఆర్ ఆదేశాల మేరకు ఫారెస్ట్ అండ్ రెవెన్యూ ఉన్నతాధికారులతో త్వరలో సమావేశం’ అని కాంతారావు ప్రకటించారు.
ఫీచర్జ్ ఇమేజ్: ఎమ్మెల్యే కాంతారావు నిర్వహిస్తున్న మాస పత్రిక సౌజన్యంతో…