దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తీసిన ‘జంబలకిడి పంబ’ సినిమా గుర్తుందిగా…? అదేదో మంత్రించిన ఆకు పసరు కలిపిన మంచినీరు తాగిన ప్రజలు అటూ, ఇటూగా మారిపోతారు. అంటే పురుషులు, స్త్రీలు పరస్పర అలవాట్లకు మారుతారన్నమాట. చివరికి గర్భం కూడా పురుషులకే వస్తుంది. ఇది సినిమా కథ సారాంశం. ఇప్పుడీ ‘జంబలకిడి పంబ’ సినిమా ప్రస్తావన దేనికంటే… కరోనా వ్యాక్సిన్ పై బ్రెజిట్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అచ్చంగా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. అమెరికా ఆమోదించిన ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎలాగైనా మారిపోవచ్చని బోల్సోనారో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏమంటున్నారంటే…
‘‘వ్యాక్సిన్ తీసుకున్నాక మనుషులు మొసళ్లలా మారిపోవచ్చు. మహిళలకు గడ్డం మొలవవచ్చు. పురుషుల గొంతు మహిళల గొంతులా మారిపోవచ్చు. ఫైజర్ కంపెనీతో కుదిరిన ఒప్పందంలో అంతా క్లియర్‌గానే ఉంది. సైడ్ ఎఫెక్ట్ వస్తే బాధ్యత తీసుకోబోమని వారు చెప్పారు. అందువల్ల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏది జరిగినా అందుకు మీరే బాధ్యులు. అంతీంద్రీయ శక్తులు వచ్చినా, మహిళకు గడ్డం మొలిచినా, పురుషులకు స్త్రీల గొంతు వచ్చినా కంపెనీకి ఏ సంబంధం ఉండదు’’ అంటూ ప్రజల్లో భయాందోళనలు కలిగే విధంగా ఆయన వ్యాఖ్యానిచారు. అంతేకాదు వ్యాక్సిన్ ప్రారంభ కార్యక్రమంలో తాను కరోనా వ్యాక్సిన్ తీసుకోనని బోల్సోనారో పునరుద్ఘాటించడం గమనార్హం.