ఈ ఫొటో గుర్తుంది కదా? నిరుడు జూన్ నెలలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం సార్సాల గ్రామంలో అటవీ భూములను చదును చేసేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై దాడి జరిగినప్పటి దృశ్యం. ఈ ఘటనలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితపై సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, ఆసిఫాబాద్ జెడ్పీ వైస్ చైర్మెన్ కృష్టారావు నాయకత్వంలో ఈ దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి అటవీ అధికారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో కృష్టారావు సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. కానీ ఆ తర్వాత దాడికి నిరసనగా ఆందోళనకు దిగిన అటవీ అధికారులు చెట్టుకొకరు, పుట్టకొకరు బదిలీ అయ్యారనేది వేరే విషయం.
ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఏమని పిలుపునిస్తున్నారు? గ్రామాల్లోకి వచ్చే అటవీ అధికారులను నిర్బంధించాలని, తాను హైదరాబాద్ నుంచి రాగానే ప్రత్యక్ష యుద్ధమని, ఇందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తాను పార్టీకి విధేయుడనని, పార్టీకి నష్టం జరిగితే చూస్తూ ఊర్కోనని ఎమ్మెల్యే కాంతారావు ఫేస్ బుక్ వేదికగా హుంకరిస్తున్నారు. నిజమే… కాంతారావు వ్యాఖ్యల్లో వాస్తవమే కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో ఏజెన్సీ అడవుల్లోనే భారీ నష్టం జరిగింది. ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఏజెన్సీ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీకి గిరిజనులు పట్టం కట్టలేదు. ఉదాహరణకు ఆసిఫాబాద్, ములుగు, పినపాక, భద్రాచలం, ఇల్లెందు వంటి ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే విజయం చేకూర్చారు. మంథని, భూపాలపల్లి వంటి జనరల్ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ కే ఓటర్లు ఫలితాన్ని ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల ఓటర్లు అత్యంత ‘కసి’తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారనేది కాదనలేని వాస్తవం. కానీ, ఓటు వేసిన ప్రజల చేతిపై సిరా గుర్తు పూర్తిగా చెరగకముందే చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పంచన చేరి తమ విధేయతను చాటుకుంటున్నారనే విమర్శలు ఉండనే ఉన్నాయి.
ఇదిగో గత ఎన్నికల ఫలితాల ప్రభావమే ఇప్పుడు అధికార పార్టీలో గల పలువురు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తీవ్ర గుబులు కలిగిస్తోందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అటవీ నియోజకవర్గాల్లో గిరిజనుల ఓట్లను కొల్లగొట్టేందుకు, పరిస్థితులను తమకు అనువుగా మార్చుకునే దిశగా అధికార పార్టీ పావులు కదుపుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే కావచ్చు… ప్రభుత్వ విప్ హోాలో రేగా కాంతాారావు పోడు భూములు ప్రామాణికంగా అటవీ అధికారులను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోడు భూముల అంశంలో గిరిజనులకు లబ్ధి చేకూర్చాలనే చిత్తశుద్ధి అధికార పార్టీ నేతలకు ఉంటే అందుకు చట్టపరమైన మార్గాలు అనేకం ఉన్నాయనేది అటవీ శాఖ అధికార వర్గాల వాదన. అటవీ హక్కుల చట్టాన్ని సవరించి పోడు గిరిజన సాగుదారులకు లబ్ధి చేకూర్చడం అధికారంలో గల నాయకులకు అసాధ్యమేమీ కాకపోవచ్చంటున్నారు. కేంద్ర సర్కార్ ను ఒప్పించి, అటవీ హక్కుల చట్టాన్ని సవరించి మరోసారి పోడు వ్యవసాయ దారులైన గిరిజనుల భూములకు పట్టాలు ఇప్పిస్తే అంతకన్నా సంతోషం ఇంకేముంటుందనేది వారి వాదన,.
ఈ విషయాన్ని విస్మరించి అటవీ అధికారులను నిర్బంధించాలని, ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడాలని ప్రభుత్వ విప్ పదవిలో గల ఎమ్మెల్యే వ్యాఖ్యానిస్తే, సార్సాల వంటి ఘటనలను జరిగిందే అందుకు బాధ్యులెవరని అటవీ అధికార వర్గాలు ప్రశ్నిస్తూ, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విప్ కాంతారావు చేస్తున్న ఆయా వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రభుత్వ పెద్దలు స్పందించి, నిలువరించకపోవడాన్ని కూడా అటవీ అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి.