తెలంగాణా సీఎం కేసీఆర్ అడుగులు రాజకీయంగా ఢిల్లీవైపు పడుతున్నాయా? జాతీయ రాజకీయాలవైపు కేసీఆర్ పయనించే సమయం ఆసన్నమైనట్లేనా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ విషయంలో సీఎం కేసీఆర్ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లేనా? అందుకు సంబంధించి కొన్ని ‘ఫీలర్లు’ వెలువడుతున్నాయా? ఢిల్లీలో రైతుల ఉద్యమం, ‘భారత్ బంద్’పై ముఖ్యమంత్రి చేసిన ప్రకటన, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యక్తం చేసిన ఆశాభావం ఇవే సంకేతాలను వెల్లడిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముందుగా సీఎం చేసిన ప్రకటనను ఓసారి పరిశీలిస్తే… ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కేసీఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటాయని, భారత్ బంద్ ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి కేటీఆర్ తాజాగా ప్రకటించారు. రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్రంగా ఇది ముఖ్యమంత్రి నిర్ణయమని కూడా ఆయన మీడియాతో చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన ఇతర ముఖ్యనేతలు ఎక్కడికక్కడ నిరసన తెలిపి, రైతుల పోరాటానికి అండగా నిలవాలని కేటీఆర్ కోరారు.
అంతకు ముందు తెలంగాణా భవన్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లతో సమావేశమైన మంత్రి కేటీఆర్ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం విశేషం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రైతు ఉద్యమాలకు సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలని కోరడం గమనార్హం. దేశంలోని రైతులందరినీ సంఘటితం చేయాల్సిన అవసరముందని కూడా మంత్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
మొత్తంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చవి చూసిన ఫలితాల అనంతరం భారత్ బంద్ కు సీఎం కేసీఆర్ మద్ధతునివ్వడం, జమిలి ఎన్నికలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఆకాంక్ష రాజకీయంగా తెలంగాణాలో భిన్న చర్చకు తావు కల్పిస్తోంది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగిడుతున్నారని భావించడానికి తాజా పరిణామాలు సంకేతాలు కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.