తెలంగాణాలోని అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ప్రజలను భయపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు మనుషులను ఈ పులి పొట్టనపెట్టుకుంది. దీంతో ఆసిఫాబాద్ నుంచి మహబూబాబాద్ అడవుల వరకు ప్రజలు భీతావహానికి గురవుతున్నారు. పులిని బంధించేందుకు అటవీ శాఖ పడరాని పాట్లు పడుతోంది. పులి భయానికి మనుషులు అడవులకు వెళ్లడానికే జంకుతున్నారు. పులి సంచార ప్రాంతాల్లోకి వెళ్లరాదని అటవీ శాఖ కూడా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోంది.
పులి భయానికి అటవీ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతుండగా, అడవుల్లోని వన్యప్రాణులు సైతం జనారణ్యంలోకి వస్తున్నాయి. తెలంగాణా అడవుల్లో గల వివిధ రకాల వన్యప్రాణుల్లో అడవి దున్నలు కూడా ఉన్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఇవి అరదుగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఏటూరునాగారం వంటి అభయారణ్యాల్లో అడవి దున్నల సంచారం ఎక్కువ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ అడవి దున్నలు కనిపిస్తున్నాయి. పులి భయంతో ఈ అడవి దున్నలు కూడా అటవీ ప్రాంతాన్ని వీడి జనబాహుళ్యపు ప్రాంతానికి వస్తున్నాయి. కొత్తగూడెం క్రాస్ రోడ్ వద్ద కనిపించిన అడవి దున్న దృశ్యాన్ని దిగువన గల వీడియోలో మీరూ చూసేయండి.