‘’దుబ్బాకలో ఓటమికి బాధ్యత వహిస్తున్నాను, ప్రజల తీర్పును శిరసా వహిస్తున్నా. దుబ్బాకలో ఓడిపోవడానికి గల కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటాం. దుబ్బాక ప్రజలకు అండగా ఉంటా. వారి సేవలో నిరంతరం పాటుపడతాం. ఓడిపోయినప్పటికీ దుబ్బాక ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం.’’ దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రి హరీష్ రావు చేసిన కీలక వ్యాఖ్యలివి.
హరీష్ రావు చేసిన ఆయా వ్యాఖ్యలు అధికార పార్టీలో ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటి వరకు ఏ ఉప ఎన్నికల్లో బాధ్యతను తీసుకున్నప్పటికీ హరీష్ రావు వెనుదిరిగి చూడని విజయమే లభించింది. కానీ దుబ్బాక ఎన్నికల్లో మాత్రం అందుకు విరుద్దంగా ఫలితం రావడం గమనార్హం. ఇక్కడ ఓటమికి బాధ్యత తనదేనని హరీష్ రావు ప్రకటించడం ఈ సందర్భంగా అధికార పార్టీలో భిన్నాభిప్రాయాలకు తావు కల్పించింది.
తరుముకొస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, రాసలీలల వివాదంలో చిక్కుకున్న ఓ మంత్రి వివాదం నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం అనంతరం ఈ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోవచ్చనే సారాంశంతో వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దుబ్బాక ఫలితంపై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ, ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నానంటూ స్వయంగా ప్రకటించడం అధికార పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదే దశలో దుబ్బాక ఫలితం తాము అశించిన విధంగా రాలేదని, ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషించి భవిష్యత్లో ముందుకు పోతామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా ప్రకటించారు. అయితే దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం పరిణామాలపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నదే అధికార పార్టీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది.