జో వచ్చినా, ఎల్లయ్య వచ్చినా, కమలమ్మ వచ్చినా, మేరీ వచ్చినా అమెరికా సామ్రాజ్యవాదులకు పసందైన మార్కెట్ కోసం ఇండియాను, దాని పాలకుడైన మోడీని పొగడవలసిందే. మన దేశ అపారమైన వనరులను, చౌక శ్రమ శక్తి ని కొల్లగొట్టాలంటే తప్పదు మరి. అదీ ప్రపంచ మార్కెట్ లో భారత్ ప్రాముఖ్యత! పశ్చిమ ఐరోపా జనాభా సుమారు 45 కోట్లు ఉంటుంది. భారత సంపన్నుల జనాభా కూడా దాదాపు 45 కోట్లు!
మొత్తం ఈ పశ్చిమ ఐరోపాలో ఎన్ని ఆధునిక వస్తువులు? టీవీలు, ఫ్రిజ్జులు, ఏసీలు, కెమెరాలు, సెల్ ఫోన్లు, కమ్యూనికేషన్ పరికరాలు, వాషింగ్ మెషీన్లు, లాప్ టాప్ లు, విమానాలు, ఫైటర్ జెట్లు, సబ్ మెరైన్లు, టాంకులు, డ్రోన్లు, మోటారువాహనాలు, ఉక్కు, అల్యూమినియం, కర్మాగారాల యంత్రాలు… అబ్బో ఎన్నెన్ని అమ్ముడు పోతాయో భారత్ లో… అన్నీ అమ్ముడు పోతాయి.
ఐరోపా 95% ఆధునిక వస్తువులు తానే ఉత్పత్తి చేసుకొంటుందీ, ఎగుమతీ చేస్తుంది. ఎగుమతి చేయలేకపోతే కుప్పకూలుతుంది.
అందుకే ఐరోపాకు చెందిన బ్రిటన్, ఫ్రాన్సూ, జర్మనీ, అటు అమెరికా ఇటు జపానూ భారత మార్కెట్ స్వంతం చేసుకోవడం కోసం వెంపర్లాడుతాయి. అవి భారత్ లోనే కర్మాగారాలు పెట్టి, ఇక్కడి
ముడిసరుకూ, చౌక కూలీలనూ ఉపయోగించుకుని, ఇక్కడే అమ్మి, విదేశాలకు ఎగుమతీ చేస్తాయి, భారీ లాభాలు ఆర్జిస్తాయి.
భారత ప్రధాని కటాక్షంకోసం తహతహలాడుతాయి.
✍️ జంపన్న