గ్రామీణ వ్యవసాయ రంగాల్లో గత మూడు, నాలుగు దశాబ్దాలుగా అనేక మార్పులు జరిగాయి. వందల ఎకరాలలో ఉన్న భూస్వాములు చాలా వరకు తగ్గిపోయారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో భూస్వామ్య ఆధిపత్యం ఘోరంగా ధ్వంసమైంది. భూస్వామ్య దోపిడీ నేడు దేశంలో నామమాత్రమైనది, అల్పమైనది. ఉపరితలంలో భావజాల రంగంలో ఇంకా బలీయంగా ఉన్నప్పటికీ పెట్టుబడి సంస్కృతి నేడు ప్రజల జీవితాలలో అన్ని రకాలుగా ఆక్రమించింది. భూస్వాముల అర్థిక దోపిడీ అణిచివేతలు అతితక్కువ చోట్ల మాత్రమే.
భారత ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగంలో బడా పెట్టుబడిదారీ నాయకత్వం ఆధిపత్యమే కొనసాగుతున్నది. సామ్రాజ్యవాద దోపిడి సైతం కొనసాగుతున్నది. అంతిమ సారాంశంలో పెట్టుబడిదారీ ఆధిపత్యమే.
స్వేచ్ఛాయుతమైన కూలీ (శ్రామికుడు)నే తప్ప నేడు భూస్వామ్య పద్ధతిలో వున్న కూలీలు ప్రధానంగా లేరు. జీతగాళ్ల పద్ధతి చాలా వరకు తగ్గిపోయింది. వ్యవసాయ మిగులును దోచుకునే వెట్టి, దండుగలు తదితర రూపాల్లో దోపిడీ లేదు.
భూస్వాములు గతంలో కొనసాగించినటువంటి వడ్డీ వ్యాపారం తగ్గిపోయి నేడు బ్యాంకులతో పాటు వివిధ ఉద్యోగులు లేదా అడ్తిదారులు లేదా చిట్ ఫండ్ లాంటి పెట్టుబడిదారీ వడ్డీ వ్యాపారమే కొనసాగుతున్నది.
బానిసత్వం, కట్టుబానిసల పద్ధతి, నిర్భంధ శ్రమ పెద్ద ఎత్తున తగ్గిపోయాయి. రోజు కూలీలను వినియోగించి సాగు చేయడమే ప్రధాన మిగులు సేకరణ పద్ధతిగా మారింది.
వ్యవసాయ రంగం నేడు ఆధునిక ఉత్పత్తి సాధనాలతో సేద్యం చేయడమే నేడు ప్రధానమైనది. అటవీ ప్రాంతాలలో కొన్నిచోట్ల కొంతవరకు మాత్రమే వెనుకబడిన ఉత్పత్తి సాధనాలు వున్నాయి. అవి సైతం నేడు కనుమరుగయ్యే పరిస్థితులు వేగంగా పెరుగుతున్నాయి. వ్యవసాయం ప్రధానంగా ఆధునిక పద్ధతుల్లో సాగుతున్నది.
మార్కెట్ కోసమే ఉత్పత్తి జరుగుతున్నది. మార్కెట్ సంబంధాలు చాలా బలపడ్డాయి.
సమాజంలో సరుకులు విస్తరించాయి. జీవితంలో సరుకులు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. భూమి, కార్మిక శ్రమశక్తి నేడు పెట్టుబడి సరుకుగా మారిపోయింది.
పట్టణాలు చాలా అభివృద్ధి చెందాయి. పట్టణ జనాభా నేడు సుమారు 48 కోట్లు. జనాభా రీత్యా పారిశ్రామికంగా సేవారంగంలో జరుగుతున్న మార్పులు, పెరుగుతున్న దిశ పూర్తిగా పెట్టుబడిదారీ విధానాన్నే సూచిస్తుంది. దేశ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి కాకుండా భూస్వామ్య బంధాలు అడ్డుకోవడమనేది నేడు ఎంతమాత్రం సత్యం కాదు. సామ్రాజ్యవాదుల సంక్షోభం గ్లోబలైజేషన్ ఫలితంగా దేశంలోని అంతర్గత వివిధ చలనాల ఫలితంగా అడ్డదిడ్డంగానో, వక్రీకరణగానో పెరిగింది పెట్టుబడిదారీ విధానమే. శిశువు అంగవైకల్యంతో పుట్టినంత మాత్రాన మానవ శిశువు కాకుండానే పోదు.
భారత దేశంలో నేడు అసంఘటిత కార్మికవర్గంతో కలిపి భారత కార్మిక వర్గ జనాభా సుమారు 48 కోట్లు.
వలసలు గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతానికి తరలివెళ్లడం తీవ్ర రూపం దాల్చి, నేడు వ్యవసాయరంగం పనులకు కూలీలు దొరకని పరిస్తితి పెరగడం, తత్ఫలితంగా మరింతగా వ్యవసాయ రంగం యాంత్రీకరణ పెరుగుతున్నది. చివరకు డ్రోన్లను వినియోగించే పరిస్తితి వచ్చింది.
ఉత్పత్తి రంగంలో వ్యవసాయ రంగం వాటా అతి తక్కువ. సేవారంగం ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఆక్రమించింది. పారిశ్రామిక రంగం వాటా సైతం ఇంచుమించుగా వ్యవసాయరంగాన్ని పోలిన విధంగా వున్నప్పటికీ, సేవారంగం సైతం సారాంశంలో పెట్టుబడిదారీ రంగమే. అందువల్ల దేశీయ అర్థిక రంగం మొత్తంగా పెట్టుబడిదారీ ఆర్థిక విధానంగానే కొనసాగుతున్నది.
భారత పెట్టుబడి చాలా విస్తరించింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాలలో చెప్పుకోదగిన రీతిలో భారత బడా బూర్జువా పెట్టుబడులు నిరంతరం పెరుగుతున్నాయి. ఇప్పటికీ భారత సామ్రాజ్యవాద దేశంగా పేర్కొనే విధంగా లేనప్పటికీ, భారత్ ఎమర్జింగ్ దర్డ్ వరల్డ్ కంట్రీగా ముందుకొచ్చింది.
వ్యవసాయ రంగంలో నేడు వ్యాపార పంటలతో ప్లాంటేషన్లతో వివిధ రకాల తోటలతో ఉత్పత్తి కొనసాగిస్తున్న వారు పెట్టుబడిదారులే. పెట్టిబడిదారీ దేశాలలో వ్యవసాయ రంగాన్ని కొనసాగించే పద్ధతే ఇది తప్ప వీరిని భూస్వాములుగా గుర్తించడమంటే పెట్టుబడిదారీ దేశాలలో వ్యవసాయరంగం ఏ విధంగా వుంటుందో అర్థం చేసుకోవడంలో స్వీయాత్మకతకు, యాంత్రికతకు గురికావడమే.
దేశ పారిశ్రామిక సేవారంగానికి సంబంధించిన ఉత్పత్తులలో బహుళ జాతుల కంపెనీల దోపిడీ, ఆధిపత్యం కూడా ఉన్నప్పటికి దేశం పెట్టుబడిదారీ దేశమే అవుతుంది తప్ప భూస్వామ్య విధానం కాదు.
సమాజంలో నేడు కొనసాగుతున్న విలువలు భూస్వామ్య సమాజంలో పవిత్రంగా చూడబడిన కుటుంబ సంబంధాలు అన్నదమ్ముల, భార్యభర్తల, తల్లిబిడ్డల అనుబంధాలు మార్కెట్ మయం అయ్యాయి. పాత సమాజంలో పవిత్రంగా చూడబడిన గురువులు, డాక్టర్ల లాంటి వృత్తులకు నేడు గౌరవం అభిమానాలు లేకుండా సంబంధాలు అన్నీ సరుకుమయం అయినవి. ఇప్పటికీ భూస్వామ్య విలువలతో కూడిన ప్రేమ అనుబంధాలు కొంతవరకు కొనసాగుతున్నప్పటికీ అవి క్షీణించే దశలో, గతకాలపు స్మృతులను నెమరువేసుకునే విధంగా మారిపోతున్నాయి.
కులం నేడు పునాదిలో ఆర్థిక రంగంలో కుల వృత్తులు ధ్వంసం కావడం ద్వారా చాలా బలహీనపడింది. అయితే భావజాల రంగంలో నేటికి బలమైనదే.
దేశంలో గత 100 సంవత్సరాలుగా పెరిగిన పారిశ్రామీకరణ, విద్య, వర్గపోరాటాల ఫలితంగా అంతర్జాతీయంగా వివిధ ప్రజాస్వామిక కమ్యూనిస్టు పోరాటాల ప్రభావం ఫలితంగా దేశంలో అంతకంతకు మత భావనల స్థానంలో శాస్త్రీయ అలోచనలు లౌకిక, ప్రజాస్వామిక దృక్పథం పెరిగింది. అయితే భారత దేశంలో ఉన్న ప్రత్యేకత్వం అంటే కుల వ్యవస్థ కోట్లాది దేవతలు వుండి కొనసాగుతున్న మత భావనల రీత్యా, అనేక కారణాల రీత్యా దోపిడి వర్గాలు మత భావాలను రెచ్చగొట్టే విధంగా దానిని మరింత తీవ్రపరిచే విధంగా ప్రజల సామాజిక, అర్థిక, రాజకీయ జీవితాలను అతలాకుతలం చేస్తున్నప్పటికీ, దానికి వ్యతిరేకంగా పెరుగుతున్న ధోరణిని గమనించాలి.
భారత సమాజంలో వున్న కుల, మత భావజాలాలు పెట్టుబడిదారీ సమాజమే కాదు. నూతన ప్రజాస్వామిక విప్లవ విజయవంతం అయిన తర్వాత చాలా కాలం బలంగానే వుంటుంది. నిజానికి పెట్టుబడిదారీ విధానం అంటే అశాస్త్రీయ మత భావనలు సమూలంగా నిర్మూలిస్తుందనేది లేదు. తన పారిశ్రామిక అవసరాల మేరకే సైన్స్ ను డెవలప్ చేస్తుంది. పెట్టుబడిదారీ వర్గం తన ప్రయోజనాల రీత్యా పాత సమాజపు అన్ని రూపాలను, విలువలను, భావజాలాన్ని నిర్లజ్జగా వినియోగించుకున్న చరిత్ర ప్రజా విప్లవాలు విజయవంతం అయిన కాలం తరువాత నుండి అన్నీ పెట్టుబడిదారీ దేశాల చరిత్రలు నేటి వరకు తెలియచేస్తున్నాయి. అందుకోసం భారత్ లో మత భావనలు బలంగా నేటికి ఏవిధంగా వున్నాయోనని చెపుతూ భూస్వామ్య వ్యవస్థ అనడం పసలేనిదే.
లెనిన్ చెప్పిన విధంగా ప్రపంచంలోని అన్ని దేశాల చట్టసభలు దోపిడీ వర్గాలతో నిండివుండేవే. పెట్టుబడిదారీ దేశాలలో సైతం ప్రజాస్వామ్యం నేతిబీరకాయలో నెయ్యిచందమే. ప్రజలు తమ హక్కుల కోసం తమ న్యాయమైన సమస్యల కోసం ఎప్పుడైతే పోరాడుతారో అప్పుడు ఆ దేశంలోని ప్రజాస్వామ్యం రంగు బహిర్గతమై ఫాసిస్టు అణిచివేతలు కొనసాగించిన తీరు అన్నీ పెట్టుబడిదారి దేశాల చరిత్రలో గత 100 సంవత్సరాలలో ఏనాడు మినహాయింపు లేదు. అందుకోసం పెట్టుబడిదారి దేశాలలో ప్రజాస్వామిక హక్కులు వుంటాయని, భూస్వామ్య దేశాలలో ప్రజాస్వామిక హక్కుల స్థానంలో అణచివేత వుంటుందనే చిలుక పలుకులు కాకుండా భారత్ లో వున్నది బూర్జువా ప్రజాస్వామ్యమే అని గుర్తించాలి.
బూర్జువా ప్రజాస్వామ్యం అంటే దోపిడీ, అణిచివేతలు వుండవని కాదు. నేటి భారత పార్లమెంటరీ వ్యవస్థ కపటంతో వర్గ దోపిడికి సాధనం అయినప్పటికీ చైనాలో ఎలాంటి ప్రజాస్వామిక హక్కులు లేకుండా భూస్వామ్య ప్రభువుల నిరంకుశ రాజ్యం లాంటిది మాత్రం కాదు. చైనా రాజ్య వ్యవస్థకు, భారత్ చట్టసభలకు భిన్నమైన తేడా వుంది. కామ్రేడ్ లెనిన్ జారిస్టు రష్యాను పెట్టుబడిదారీ దేశంగా ప్రకటించడమే గాక ఆనాటి ఫ్యూడల్ చక్రవర్తి ఏలుబడిలో దేశంలో ఎలాంటి ప్రజాస్వామిక హక్కులు లేకుండా వున్న స్థితిలోనే పార్లమెంట్ లో కమ్యూనిస్టు పార్టీ ఎన్నికలను ఒక ఎత్తుగడగా వుపయోగించుకోవాలని లెనిన్ చెప్పిన విషయాన్ని మనం దృష్టిలో వుంచుకోవాలి. ఆనాటి రష్యాలో వున్న ప్రజాస్వామిక హక్కులకు నేడు భారత దేశంలో కొనసాగుతున్న దానికి తేడా ఏమైనా నాడు భారత దేశానికంటే మెరుగుగా ప్రజాస్వామిక హక్కులు ఏమీలేవు. మరింత ఘోరమైనదే రష్యన్ జారిస్ట్ పార్లమెంటరీ చరిత్ర. భారత్ దేశంలో ప్రజాస్వామ్య హక్కులు లేవు కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ అనడం ఏరకంగా కూడా సరికాదు.
దున్నేవానికే భూమి నినాదంతో అనేక సంవత్సరాలుగా దేశంలో ఎక్కడ బలమైన రైతాంగ పోరాటాలు లేవు. భూస్వామ్య దోపిడీకి వ్యతిరేక పోరాటాలు నామమాత్రం అయ్యాయి.
దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగిన కొన్ని ప్రజా వుద్యమాలన్నీ ప్రధానంగా పెట్టుబడిదారీ దోపిడీకి, రాజ్య దోపిడీ, అణిచివేతలకు వ్యతిరేకంగానే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సైతం కోస్తా, బడా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగానే. నేడు దేశంలో వివిధ రూపాలలో అనేకంగా ముందుకు వస్తున్న పోరాటాలు ప్రధానంగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగానే వున్నాయి. ఇవన్నీ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగానే తప్ప భూస్వాములకు వ్యతిరేకంగా కాదు. ఆర్థిక రంగంలో పెట్టుబడి, దోపిడీ, అణిచివేతలకు వ్యతిరేకంగా భావజాల రంగంలో పెట్టుబడిదారీ భావజాలానికి వ్యతిరేకంగానే కాకుండా భూస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా తీవ్రంగానే కొనసాగుతున్నవి. అవి కుల సమస్య రూపంలో, హిందూ మతోన్మాదం రూపంలో, బాబాల రూపంలో కొనసాగుతున్నవి.
భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల జాతులు గానీ, కాశ్మీరు గానీ దశాబ్దాలుగా భారత దళారీ బూర్జూవాలచేత, సామ్రాజ్యవాదులచేత, వివిధ పెట్టుబడిదారులచేత వనరుల దోపిడికి, శ్రమ దోపిడికి గురవుతున్నారు. ఈ రాష్ట్రాలలో కొద్దిమేరకు భూస్వామ్య దోపిడీ ఏ మేరకైనా వున్నప్పటికీ, మొత్తంగా గమనించినపుడు ఈ ప్రాంతాలు పెట్టుబడిదారులచేత దోపిడి అణిచివేతలకు గురికావడమే ప్రధానం. ఈప్రాంత ప్రజలు భారత్ నుండి విడిపోవడానికి కొనసాగిస్తున్న పోరాటాలు అంతిమ సారాంశములో పెట్టుబడిదారులకు వ్యతిరేకంగానే జరుగుతున్నది.
పెటీబూర్జూవా వర్గాలైన విద్యార్థులు మేధావులు, వివిధ వృత్తుల ఉద్యోగులు, చేతివృత్తుల ప్రజానీకం సమస్తం నేడు భూస్వామ్య దోపిడీకి, భూస్వామ్య బందనాలతో అణిచివేతకు గురికావడం లేదు. వీరు మొత్తంగా పెట్టుబడి దోపిడీకి, అంటే అది సామ్రాజ్యవాద దోపిడీ కావచ్చు లేదా బడా బూర్జువా దోపిడీ కావచ్చు అంతిమ సారాంశములో పెట్టుబడిదారి దోపిడీనే.
మహిళలు నేడు ఆర్థిక దోపిడికి గురి కావడమంటే ప్రధానంగా పెట్టుబడిదారీ దోపిడినే. కార్మికులుగా, రైతులుగా, పెటీబూర్జూవా వర్గంగా, వివిధ రకాల పెట్టుబడిదారుల చేత దోపిడి అణిచివేతలకు గురవుతున్నారు. వీరిపై భావజాలపరంగా, సాంస్కృతికంగా భూస్వామ్య పెట్టుబడిదారీ పితృస్వామిక దోపిడి అణిచివేతలు కొనసాగుతున్నాయి.
రైతాంగం మొత్తంగా సామ్రాజ్యవాదుల దళారీ బూర్జువా వర్గాలతో అన్ని రకాల పెట్టుబడిదారుల రాజ్యం దోపిడీకి అణిచివేతలకు గురి అవుతున్నది. రైతాంగం నేడు ఎదుర్కుంటున్న గిట్టుబాటు ధరల సమస్య గానీ, తాము కొనుగోలు చేసే నిత్యావసర సరుకుల నుండి మొదలుకొని వ్యవసాయ పరికరాలు, ఎరువులు, పురుగుమందులు వగైరాలలో కానీ, బ్యాంకు వడ్డీ రుణాలలో గానీ, అవినీతి లంచగొండి అధికారుల మోసాలు, దందాలలో గానీ, తమ భూములు కంపెనీలకు ప్రాజెక్టుల రూపంలో కోల్పోయే విషయంలో గానీ పెట్టుబడిదారుల దోపిడి తప్ప ఎక్కడ భూస్వాముల దోపిడి కనపడదు.
దేశవ్యాప్తంగా 48 కోట్ల కార్మిక వర్గం, రైతాంగం, పెటీబూర్జూవా వర్గంలోని విద్యార్థులు మేధావులు, వివిధ వృత్తుల ఉద్యోగులు, చేతివృత్తుల వారు, జాతులు, ఆదివాసులు, మహిళలు, దళితులు మొదలైనవారందరు నేడు పెట్టుబడిదారీ దోపిడి పీడనలకు గురికావడమే నేడు ప్రధానంగా కొనసాగుతున్నది.
✍️ జీనుగ జంపన్న
(రచయిత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు)