ఏకంగా మెదడును తినే అమీబా ఒకటి అమెరికాను తీవ్రంగా భయపెడుతున్నట్లు అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి. స్థానికంగా సరఫరా చేసిన నీటిలో మెదడును తినే అమీబాను టెక్సాస్ అధికారులు గుర్తించారు. ఈ అమీబా కారణంగా ఓ ఆరేళ్ల బాలుడు మృతి చెందడంతో ప్రభుత్వం వెంటనే విపత్తు ప్రకటనను జారీ చేయడం గమనార్హం. టెక్సాస్ లోని జాక్సన్ సరస్సులో నీటిని పరీక్షించిన అనంతరం అందులో మెదడును తినే అమీబా చేరినట్లు నిపుణులు వెల్లడించారు. మృతి చెందిన జూసియా మైక్ ఇంటైర్ అనే ఆరేళ్ల బాలుడు అనారోగ్యానికి గురై మరణించగా, అతని తలలో అరుదైన మెదడును తినే అమీబానువైద్యులు పరీక్షల్లో గుర్తించారు.
నీరు తాగినప్పుడు అమీబా ముక్కు నుంచి మెదడుకు వెళ్లి తినడం మొదలుపెడుతుందని, సరైన సమయంలో సరైన చికిత్స అందించకుంటే ప్రాణాపాయం తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. కుళాయి నీటిని తాగవద్దని, దాంతో వంట కూడా చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో బాగా వేడి చేసి, చల్లార్చిన తర్వాతే కుళాయి నీటిని తాగడానికి వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం మెదడును తినే అమీబా మూలాల అన్వేషణలో అక్కడి నిపుణులు నిమగ్నమయ్యారు. ఓ వైపు కరోనా మహమ్మారితోనే ప్రపంచం అతలాకుతలాం అవుతుండగా, మెదడును తినే అమీబా అనవాళ్లు వెలుగు చూడడంతో అమెరికా వాసులు బెంబేలెత్తుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.