వామపక్ష పార్టీలకు చెందిన పలువురు ‘ఖమ్మం కామ్రేడ్స్’ కరోనా బారిన పడుతున్నారు. కరోనా కల్లోల పరిణామాల్లోనూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమదైన శైలిలో పోరాటాలు నిర్వహిస్తున్న కామ్రేడ్స్ కరోనా బాధితులుగా మారుతున్నారు.
తాజాగా సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుకు, ఆయన సతీమణి అనుమతికి, కారు డ్రైవర్ గోపికి కరోనా సోకింది. ఈ విషయాన్ని నున్నా నాగేశ్వరరావు తమ అధికారిక వాట్సాప్ ‘మీడియా గ్రూప్’ ద్వారా స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తామంతా హోం క్వారంటైన్ లో ఉన్నామని, మీడియా మిత్రులు కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని నున్నా నాగేశ్వరరావు కోరారు.
అదేవిధంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు పోటు రంగారావు కూడా కరోనా బారిన పడి, చికిత్స తీసుకుని కోలుకున్నారు. అదే పార్టీ అనుబంధ సంఘం ఇఫ్టూ జిల్లా నాయకుడొకరికి కూడా శనివారం కరోనా పాజిటివ్ గా వైద్య పరీక్షల్లో తేలినట్లు సమాచారం. వామపక్ష నేతలు నిత్యం ప్రజల్లో తిరుగుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నారని, అందువల్లే కరోనా బాధితులుగా మారుతున్నారని ఆయా పార్టీల శ్రేణులు చెబుతున్నాయి.
ఫొటో: సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు