నిరసనల్లో వినూత్న నిరసన ఇది. ఓ రకంగా చెప్పాలంటే వింత నిరసన. మరో రకంగా చెప్పాలంటే తాము ఎన్నుకున్న ఎమ్మెల్యే ఖరీదైన కారుపై విసిరిన సెటైర్ ఇది. ఇంకోవైపు తమ సమస్యను సమాజానికి వేగంగా చేరేలా చేసిన ఓ వ్యక్తి ప్రయత్నమిది.
ఇంతకీ విషయమేమిటంటే… ఇక్కడ గల ఫ్లెక్సీని ఓసారి తేరిపార చూసి చదవండి. ‘ఇటీవలే రూ. 3 కోట్ల ఖరీదైన కొత్త కారు కొన్న మా ఎమ్మెల్యే గౌ. శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఆర్మూర్ ప్రజల కోసం కాకపోయినా తన ఖరీదైన కారు కోసమైనా రోడ్డు వేయించాలని కోరుతూ…’ అంటూ మైలారం బాలు అనే వ్యక్తి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది.
ఆ పక్కనే ‘ఆర్మూర్ మామిడిపల్లి రైల్వే గేట్ దగ్గర రోడ్’ అంటూ రహదారి దుస్థితిని తెలిపే చిత్రాన్ని కూడా ఫొటోలో అచ్చువేశారు. ఈ పక్కన బహుషా ఎమ్మెల్యే కొత్తగా కొన్న రూ. 3 కోట్ల విలువైన కారు ఫొటోలు కాబోలు. ఇప్పుడీ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మరి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన కారు కోసమైనా ఫ్లెక్సీ కట్టిన యువకుని రోడ్డు కోరిక తీరుస్తారో లేదో వేచి చూడాల్సిందే.