ఫోటోలో మీరు చూస్తున్న ఇతని పేరు పాండు. పూర్తి పేరు పాండురంగారావు. హైదరాబాద్ నగరంలో జగమెరిగిన జర్నలిస్టు. ముఖ్యంగా అన్ని పార్టీలకు చెందిన అనేక మంది నేతలకు సుపరిచిత పాత్రికేయుడు. హోదా పెద్దది కాకపోవచ్చు. సాధారణ కంట్రిబ్యూటరే కావచ్చు. గాడ్ ఫాదర్ లేకపోవడమో, భజన చేయకపోవడమో… కారణాలు ఏవైనప్పటికీ కనీసం స్టాఫ్ రిపోర్టర్ స్థాయికి కూడా చేరుకోలేకపోయాడు.
కానీ ఓ పత్రికకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్న పే…ద్ద జర్నలిస్టు స్క్రిప్టును ఎన్నోసార్లు కరెక్షన్ చేసిన చరిత్ర పాండుకు ఉంది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పాండు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. చిన్నా, చితకా లీడర్ నుంచి ప్రస్తుతం మంత్రి స్థాయి వరకు ఎదిగిన పలువురు లీటర్లకు పాండు జర్నలిజం ప్రస్థానం తెలుసు.
కొందరు రాజకీయ నేతలు పార్టీల కండువాలు మార్చిన తరహాలో పాండుకు పత్రికలు మారే అలవాటు లేదు. పాతికేళ్ల జర్నలిజం ప్రస్థానంలో 1996 నుంచి ఒకే పత్రికలో పనిచేస్తున్నాడు. ఆ పత్రికలో విలేకరులకు ముఖ్యంగా కంట్రిబ్యూటర్లకు కనీసం ‘లైన్ ఎకౌంట్’ ఇచ్చే అలవాటును యాజమాన్యం ఎప్పుడో మర్చిపోయందనే ప్రచారం ఉండనే ఉంది.
ఈ పత్రికకు హైదరాబాద్ లో పనిచేసే స్టాఫ్ రిపోర్టర్లకు, సీనియర్ రిపోర్టర్లకు వాయిదాల పద్ధతుల్లో, ఇన్ స్టాల్ మెంట్ల రూపంలో జీతాలుగా పేర్కొనే చాలీచాలని మొత్తాలు ఇస్తారని ప్రతీతి. ఇక జిల్లాల్లో పనిచేసే బ్యూరో ఇంచార్జిలకు వేతనాల ప్రస్తావనే లేదు. పత్రికను ‘ఫ్రాంచైజీ’లు విక్రయించుకుని నిర్వహిస్తున్న రీతి.
ఇటువంటి పద్దతుల్లో పత్రికను నడుపుతున్న యాజమాన్యం సాధారణ కంట్రిబ్యూటర్ గా పనిచేస్తున్న పాండును మాత్రం పట్టించుకుంటుందని ఎలా విశ్వసించగలం? కానీ పాండు పత్రికనే నమ్ముకున్నాడు. తాను రిపోర్టర్ గా పనిచేస్తేనే పూట గడిచే పరిస్థితి పాండు కుటుంబానిది. కరోనా కల్లోలం, లాక్ డౌన్ పరిణామాల్లో కనీస అవసరాలు కూడా తీరని ఆర్థిక కష్టాల్లో పాండు చిక్కుకున్నాడు. అద్దె ఇంట్లోనే ఉంటున్న పాండుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమా సీన్లను తలపించే పుట్టెడు కష్టాలు పాండు జీవితంలో నిత్యభాగంగా మారాయి. అయినప్పటికీ పాండు ఎలాగోలా తన బతుకు బండిని లాగుతూనే ఉన్నాడు.
కానీ కరోనా మహమ్మారి కళ్లు పేద జర్నలిస్టు పాండుపై పడ్డాయి. వైద్య పరీక్షల్లో పాండుకు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన కింగ్ కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రయివేట్ ఆసుపత్రికి వెళ్లే ఆర్థిక స్థితి లేకపోవడంతో తనకు తెలిసిన ఓ ప్రభుత్వ వైద్యాధికారి సహాయంతో కింగ్ కోఠి ఆస్పత్రిలో చేరాడు.
ఓ నిరుపేద జర్నలిస్టుకు జబ్బు వస్తే… అందునా కరోనా సోకితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైంది. దాదాపు పాతికేళ్లుగా పాండుతో సేవలు చేయించుకుంటున్న పత్రిక యాజమాన్యం కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. గడచిన ఎనిమిదేళ్లుగా పాండుకు లైన్ ఎకౌంట్ డబ్బులు కూడా పత్రిక యాజమాన్యం చెల్లంచడం లేదట. పాండు సేకరించిన అడ్వర్టయిజ్మెంట్ల కమీషన్ కూడా ఇవ్వలేదట.
‘ప్రెస్ మీట్లు నిర్వహించే వారిని నుంచి ఎంతో కొంత ‘అడుక్కుని’ ఎలాగోలా బతికేయ్’ అని పత్రికకు చెందిన ముఖ్యులు పాండుకు ఉచిత సలహాలు కూడా ఇచ్చారట. కరోనా సోకిన పరిస్థితుల్లోనూ ‘పాండు’ ఎలా ఉన్నాడనే విషయం గురించి పత్రిక నిర్వాహకులే కాదు, ముఖ్యులు కూడా పట్టించుకోవడం లేదట. కనీస పలకరింపు కూడా కరవైందట.
ఇటువంటి పరిస్థితుల్లోనే పాండు దైన్య స్థితిపై కొందరు సీనియర్ జర్నలిస్టులు స్పందించారు. అతని దీనావస్థను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న తెలంగాణా మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ పాండు ఇంటికి వెళ్లి, అతని కుటుంబ సభ్యులకు రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. పాండుకు సుపరిచితులైన సీనియర్ జర్నలిస్టులు తోచిన రీతిలో రూ. 500, 1,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు.
కానీ పాండు చేత పాతికేళ్లుగా సేవలు పొందుతున్న పత్రిక యాజమాన్యం మాత్రం చిల్లిగవ్వ సాయానికి కూడా ముందుకు రాలేదు. ఈ కష్టకాలంలో అతనికి చెల్లించాల్సిన మొత్తాల గురించి కూడా యోచించడం లేదట. సగటున నెలకు రూ. 3 వేల చొప్పున పరిగణించినా రూ. 2.88 లక్షలు, కనిష్టంగా ఏటా రూ. 50 వేల చొప్పన యాడ్ కమీషన్ ను లెక్కించినా రూ. 4.00 లక్షలు… మొత్తంగా దాదాపు రూ. 7.00 లక్షల వరకు పత్రిక యాజమాన్యం పాండుకు బాకీ ఉందంటున్నారు.
కానీ… కరోనా సోకిన పాండు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అంశంపై పత్రిక యాజమాన్యం కనీసం ఆరా కూడా తీయడం లేదట. ఇప్పుడు చెప్పండి… ఆ పత్రిక నిర్వాహకులను ఏమనాలి? అందులో పనిచేస్తున్న పెద్దలను ఎలా నిందించాలి? అసలు దాన్ని పత్రికే అందామా? దాని నిర్వాహకులను యాజమాన్యంగానే అభివర్ణిద్దామా? పాండు ప్రస్తుత దైన్య స్థితి… జర్నలిజమే ప్రాణంగా భావించేవారికి ఓ గుణపాఠంగా స్వీకరించాల్సిన అవశ్యకతను గుర్తు చేయడం లేదూ!