కరోనా మహమ్మారిని ప్రపపంచానికి పరిచయం చేసిన చైనాలో ఇది మరో కలకలం. బ్రెజిల్, ఈక్వెడార్ దేశాల నుంచి దిగుమతి అయిన చికెన్, చేపలు, పీతల్లోనూ కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించినట్లు చైనా పేర్కొంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ మీడియా వార్తా కథనాలను కూడా ప్రచురించింది.
బ్రెజిల్ నుంచి చైనాకు దిగుమతి అయిన ‘ఫ్రోజెన్ చికెన్’ ‘(నిల్వ గల కోడి మాంసం)లో కరోనా వైరస్ కనిపించింది. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా సముద్రాల మీదుగా రవాణా ద్వారా దిగుమతి అయిన మాంసం నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఓ చికెన్ శాంపిల్ లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం గమనార్హం.
అదేవిధంగా ఈక్వెడార్ నుంచి వచ్చిన ఎండ్రుకాయలు (పీతలు), చేపల్లోనూ కరోనా వైరస్ ఉన్నట్లు వెల్లడైంది. దీంతో విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని చైనా తన ప్రజలను హెచ్చరించింది.