కిమ్ జోంగ్ ఉన్… ఉత్తర కొరియా అధ్యక్షుడు. ఇతని పేరు వింటే స్వదేశీయులే కాదు, శత్రుదేశాలవాళ్లు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తుంటారని ప్రతీతి. తేడా వస్తే రక్తసంబంధీకులని కూడా చూడకుండా వాళ్ల పని పట్టేందుకు కూడా కిమ్ వెనుకంజ వేయరనే ప్రచారం ఉండనే ఉంది.
ఇటువంటి ‘కిమ్’ను చూస్తే మాత్రం కరోనా భయపడుతుందా? అస్సలు భయపడదు కదా? అయినా కరోనా ‘కిమ్’కు కనిపిస్తుందేమిటి… భయపడడానికి? అందుకే ఉత్తర కొరియాలోనూ అడుగిడింది. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి వల్ల తమ దేశంలోకి కరోనా వైరస్ చొరబడినట్లు ఉత్తర కొరియా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ ప్రకటించింది.
మూడేళ్ల క్రితం ఈ వ్యక్తి దక్షిణ కొరియాకు పారిపోయాడని, ఈ నెల 19వ తేదీన అతను స్వదేశానికి తిరిగి వచ్చాడన్నది ఆయా వార్తా సంస్థ కథనం. ఈ పరిణామాల నేపథ్యంలో ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ సీరియస్ అయ్యారు. అత్యవసరంగా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.
సరిహద్దుల్లో లాక్ డౌన్ కూడా విధించారు. అసలు ఆ వ్యక్తి సరిహద్దులు దాటి ఎలా తమ దేశంలోకి ప్రవేశించాడో తెలుసుకోవాలని హుకుం జారీ చేశాడు. ఇందుకు కారకులైన వారిపై కఠిన చర్యలకు కూడా వెనుకాడబోమని ఆగ్రహంతో ప్రకటించారు.
కేవలం ఒక్క కరోనా కేసు వెలుగు చూసినందుకే కిమ్ ఎందుకింత సీరియస్ అయ్యాడో తెలుసా? ప్రపంచ దేశాలుగా యూఎన్ఓ అధికారికంగా గుర్తించిన 193 దేశాల్లోని పలావు, సమోవా, వనాటు, మార్షల్ దీవులు, టువాలు, కిరిబాటి, నౌరు, సోలమన్ దీవులు, టోంగా, మైక్రోనేషియా టర్క్ మెనిస్టాన్ దేశాల్లో గత 19వ తేదీ వరకు ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదు.
కరోనా రహిత ప్రాంతాలుగా వార్తల్లోకెక్కిన ఆయా దేశాల సరసన ఉత్తర కొరియా కూడా ఉంది. కానీ ఇప్పుడా జాబితా నుంచి ఉత్తర కొరియా మాయమైనట్లయింది. దీంతో ‘కిమ్’ తీవ్రంగా కోపగిస్తున్నాడట. అయినా కిమ్ ఆగ్రహానికి ‘కరోనా’ భీతిల్లుతుందేమిటి?