అంత్యక్రియలకు నోచుకోవలసిన శవాలకు వెయిటింగ్ లిస్ట్ ఏమిటీ? అని ఆశ్యర్యపోవలసిన అవసరం లేదు. కరోనా మహమ్మారి సృష్టించిన ఘోరమిది. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కరాళ నృత్యానికి ఈ ఘటనలు పరాకాష్టగా వార్తలు వస్తున్నాయి. అక్కడ కరోనా మరణాల సంఖ్య మళ్లీ పెరుగుతోందట. గడచిన రెండు రోజులుగా వెయ్యికి పైగా దేశంలో కరోనా మరణాలు సంభవించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. నెవడా, టెక్సాస్, అల్బామా ప్రాంతాలు రికార్డు స్థాయిలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి.
అయితే ఈ పరిణామాలు అంత్యక్రియల నిర్వహణకు తీవ్ర ప్రతిబంధకంగా మారాయి. హిడాల్గో కౌంటీ శ్మశాన వాటికల్లో అంత్యక్రియల కోసం రెండు వారాలపాటు వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందనేది అంతర్జాతీయ వార్తా సంస్థల కథనం. ఫలితంగా డెడ్ బాడీలను రిఫ్రిజిరేటెడ్ ట్రక్కుల్లో భద్రపరుస్తున్నారు. ఒక్కో ట్రక్కులో యాభై డెడ్ బాడీలను భద్రపరిచే అవకాశం ఉందట. గడచిన వారం రోజుల వ్యవధిలో హిడాల్గో కౌంటీలో కరోనా కేసులు 60 శాతం పెరగడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. అమెరికాలో కరోనా కారణంగా ఇప్పటికే 1.45 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాలు అగ్రరాజ్య ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.