ముందు వీడియోను చూడండి. తర్వాత విషయంలోకి వెడదాం…
చూశారు కదా వీడియో? విషయాన్ని క్లుప్తంగా చెప్పుకుందాం. అలక వహించి, పోలీస్ స్టేషన్ తలుపుతట్టిన ఓ భార్య తన భర్తపై కేసు పెట్టింది. ఈ భర్త తనకు వద్దే వద్దని పేచీకి దిగింది. పోలీసులు ఆమెకు నచ్చజెప్పేందుకు యత్నించారు. కానీ కుదరలేదు. ఇంతలో భార్యను శాంతింపజేసేందుకు భర్తే స్వయంగా రంగంలోకి దిగాడు. మాంచి పాటను ఆలపించాడు. ఇంకేముంది? భార్య కరిగిపోయింది. భర్త ఎదపై వాలిపోయింది. వీరిద్దరినీ కలిపిన ఆ ప్రేమ విజయపు తాలూకు వీడియోను ఓ ఐపీఎస్ ఆఫీసర్ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన జరిగింది. ఇదీ వార్తా కథనంలోని సారాంశం.
ఇప్పుడు వీడియోను మళ్లీ చూడండి. ఎందుకైనా మంచిది మరోసారి కళ్లు నలుముకుని మరీ చూడండి. విషయం బోధపడిందా? ఏదేని అనుమానం కలిగిందా? అబ్బే… ఎటువంటి అనుమానం లేదు. భర్త పాట పాడాడు. భార్య కరిగిపోయి అతని ఎదపై ఒదిగింది. ఇంకా ఇందులో అనుమానమేముంది? అని ప్రశ్నిస్తే మాత్రం అసలు విషయం తప్పక తెలుసుకోవలసిందే.
వీడియోలోని విషయం కరెక్టే కావచ్చు. ఘటన కూడా నిజమే కావచ్చు. కానీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోల పరిణామాలు. వివిధ దేశాలు ఎలా వణికిపోతున్నాయో తెలుసుగా? ఇటువంటి పరిస్థితుల్లో వీడియో ‘విజువల్’లో కనిపిస్తున్నవారిలో ఎవరికైనా కనీసం మాస్కులు ఉన్నాయా? లేవు కదా? బహుషా కరోనాకు ముందు జరిగిన ఘటన కాబోలు. తాజాగా సోషల్ మీడియాలో ఎవరో మళ్లీ అప్ లోడ్ చేసినట్లున్నారు. వీడియోకు ఫిదా అయినవారు అదే పనిగా షేర్ చేస్తున్నారు. వీడియో చక్కర్లు కొడుతోంది. కొన్ని ప్రధాన పత్రికలు కూడా వార్తా కథనాలు వండివారున్నాయ్. అదీ విషయం.