కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పొరుగున గల ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 తర్వాత ఛత్తీస్ గఢ్ లో మళ్లీ లాక్ డౌన్ విధించాలని శనివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
అయితే లాక్ డౌన్ విధించే అధికారాన్ని కలెక్టర్లకు ఇవ్వడం గమనార్హం. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నచోట మళ్లీ లాక్ డౌన్ విధించేందుకు కలెక్టర్లకే అధికారాన్ని ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలను జారీ చేయనున్నారు. కొంతకాలంపాటు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధించవచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఛత్తీస్ గఢ్ రాజధాని కేంద్రమైన రాయపూర్ లోనే తాజాగా 1,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు కనీస నిబంధనలను కూడా పాటించడం లేదని, ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని వైరస్ సమూహ వ్యాప్తి ప్రమాదంపైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. అందువల్లే మళ్లీ లాక్ డౌన్ దిశగా ఛత్తీస్ గఢ్ సర్కార్ అడుగులు వేస్తోంది.