కరోనా ధాటికి విశ్వం వణుకుతోంది. ప్రపంచ దేశాలు గజగజలాడుతున్నాయి. కానీ ఉత్తర కొరియా మాత్రం నిక్షేపంగానే ఉందట. అక్కడ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు లేదట. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు. సాక్షాత్తూ ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ప్రకటించారు. ఇదే విషయాన్ని ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ కేసీఎన్ఏ ప్రకటించింది.
గత నెల 19వ తేదీ వరకు ఉత్తర కొరియాలో 922 మందికి కరోనా టెస్టులు జరపగా, సింగిల్ పాజిటివ్ కేసు కూడా బహిర్గతం కాలేదన్నది ఆ దేశపు ఆరోగ్యశాఖ ప్రకటన కూడా. అయితే ఇప్పటి వరకు ఉత్తర కొరియాలో 25,551 మందికి క్వారంటైన్ నుంచి విముక్తి కలిగించగా, ఇంకా 255 మంది మాత్రం ఐసొలేషన్ లో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కరోనా మహమ్మారిని తమ దేశంలోకి రాకుండా నిలువరించగలిగామని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇదిలా ఉంటే కరోనా వైరస్ పుట్టిల్లుగా ప్రాచుర్యం పొందిన చైనాతో గట్టి వ్యాపార బంధం ఉన్నప్పటికీ, పొరుగునే గల దక్షిణ కొరియాలో ఇప్పటివ రకు 13 వేల పాజిటివ్ కేసులు, చైనాలో 83 వేల కేసులు నమోదైన పరిణామాల్లోనూ ఉత్తర కొరియాలో ఒక్క పాజిటివ్ కేసు లేకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. దేశాధినేత కిమ్ చెప్పే ‘కరోనా నిల్’ మాటలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వార్తా కథనాల సారాంశం. కరోనా నుంచి తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఈ సంవత్సరం ఆరంభంలోనే దేశ సరిహద్దులను మూసేశామని, లక్షణాలు ఉన్నవారిని నిర్బంధంలో ఉంచామని ఉత్తర కొరియా వివరణ ఇచ్చుకుంటోంది. మనమూ ‘కిమ్’ అనకుండా నమ్మేస్తే పోలా!