ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటైన లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించాలని కోరుతూ ఆయన జగన్ కు ఈ లేఖ రాయడం విశేషం అయితే కాస్త ఘాటైన పదజాలంతో ముద్రగడ లేఖ రాయడమే చర్చనీయాంశంగా మారింది. పాలకులు ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని ముద్రగడ ఈ సందర్బంగా జగన్ కు సూచించారు. ‘ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, అప్పటి బెంగాల్ సీఎం జ్యోతిబసు, ఉమ్మడి రాష్ట్ర దివంగత సీఎం, మీ తండ్రిగారైన రాజశేఖర్ రెడ్డి లాగా పూజలందుకోవాలేగాని, పదవి మూన్నాళ్ల ముచ్చటగా చేసుకోకండి’ అని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.
మీ విజయానికి మా జాతి సహకారం కొన్ని చోట్ల తప్ప మిగిలిన అన్నిచోట్లా మీరు పొందలేదా? అని ప్రశ్నించారు. ఎన్నికలు జరిగిన అన్ని రోజుల్లో ఇంచుమించుగా ప్రతిరోజు అప్పటి సీఎం మా జాతిని, ఉద్యమాన్ని పోలీసులతో చేయించిన దమనకాండను, అరాచకాలను, అవమానాలను మీ ఛానెల్ లో చూపించిందే చూపించి మా జాతి సానుభూతి, ఓట్లు పొందలేదా? అని నిలదీశారు. ముద్రగడ సీఎం జగన్ కు రాసిన లేఖను ఇక్కడ చూడవచ్చు.