శానంపూడి సైదిరెడ్డి… తెలుసుగా…? హుజూర్ నగర్ ఎమ్మెల్యే. తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ కోటను బద్దలు కొట్టి మరీ ఉప ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ నాయకుడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తన నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు తనదైన శైలిలో ఓ వినూత్న విన్నపం చేశారు. తెలంగాణాలో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తమనెవరూ ప్రత్యక్షంగా కలవరాదని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అక్కడి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇందుకు సంబంధించి సమష్టి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. తమను నేరుగా కలవవద్దని, వాట్సప్, ఫోన్ ద్వారా మాత్రమే సంప్రదించాలని వారు కోరారు.
ఈ పరిణామం పక్కనే గల ఉమ్మడి నల్లగొండ జిల్లాను కూడా తాకింది. హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తన ఫేస్ బుక్ ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి విజ్ఞప్తి చేశారో తెలుసా?
ఏ శుభకార్యాలకు, శంకుస్థాపనలకు ఆయనను పిలవవద్దట. తాను అటెండ్ కూడా కారట. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కరోనా తుపానులాగా వెళ్లిపోతోందని చెబుతూ, దీనికి తాను కూడా కారణం కారాదని సైదిరెడ్డి అభిలషిస్తున్నారు. తాను ఏ ఫంక్షన్ కు వచ్చినా, తనతోపాటు చాలా మంది వస్తున్నారని, అందరినీ కష్టపెట్టడం తనకు ఇష్టం లేదంటున్నారు. ఏ చిన్న ఇష్యూ అయినా తన ఇంటి దగ్గరకు కూడా రావద్దని, వాట్సాప్ మెసేజ్ పెట్టాలని, లేదా ఫోన్ చేయాలని కోరారు. అప్పటికీ కమ్యూనికేట్ కాకపోతే రావడానికి ట్రై చేయాలని, శుభకార్యాలు చేస్తే, అతి క్లోజ్ ఫ్యామిలీకి తప్ప, ఎక్కువ మందిని పిలవకండి అని కూడా హితవు చెప్పారు. ఒక్కరి శుభకార్యం… అశుభ కార్యాలయ్యే అవకాశం ఉందని, అన్యథా భావించరాదని, తాను మాత్రం రాలేననని సైదిరెడ్డి స్ఫష్టం చేశారు.
ఆయన స్వయంగా చేసిన ఆయా వినతిపై ఇంకా ఏవేని సందేహాలుంటే దిగువన గల ఫేస్ బుక్ లింకులో వీడియో చూడండి.