కరోనా నిరోధానికి పారసిటమోల్ టాబ్లెట్లు, బ్లీచింగ్ పౌడర్లు, ‘వైరస్’తో సహజీవనం… ఇవన్నీ ఒడిసిన, పాత ముచ్చట్లు. ఎన్ని రోజులని, ఎంత కాలమని అవే సంగతులను పదే పదే వల్లె వేయడం? థింక్ డిఫరెంట్. కాస్త కొత్తగా, సరికొత్తగా, వినూత్నంగా కరోనా గురించి నిర్వచించేవారే లేరా…? ఎందుకుండరు? ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండనే ఉంటారు. కావాలంటే తెలంగాణా పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును చూడండి. కరోనా నిరోధానికి ఆయన చెప్పిన సరికొత్త భాష్యం గురించి తెలుసుకోండి. ఇంతకీ ఆయన కరోనా వైరస్ గురించి ఏమంటున్నారో తెలుసా..? మంత్రి మాటల్లోనే…
‘కరోనా ఒచ్చి పడిశెం ఉన్నోళ్లకు గొంతుల ఆగుతది. గొంతుల ఉంటే…? శరీరానికెక్కుతది. పడిశెం, దగ్గు లేకపోతే…? టక్కున కడుపులకు బోతది కరోనా. మీ కడుపు మిషిన్ మంచిది. ఎసువంటి బొక్కలుగాని, సిమెంటుగాని, ఏది గూడ నమిలిపెట్టే మిషిని భగువంతుడిచ్చిండు మనకు కడుపుల మిషిని. అండ్ల మిషిన్ల బడితె… పిప్పి, పిప్పి జేసి కింది నించి బారేత్తది కరోనా రోగాన్ని గూడ. అంత మంచి మిషినిచ్చిండు భగువంతుడు. కడుపుల బడాలె మనకు. వేన్నీళ్ల ద్వారా కడుపుల బడితె ఒచ్చింది ఎల్లిపోతది’ ఇవీ మంత్రి దయాకర్ రావు కరోనా గురించి చెప్పిన సరికొత్త నిర్వచనపు వ్యాఖ్యలు.
అక్షరాల్లో బాగానే రాశారుగాని… ఆయన ఈ విధంగా మాట్లాడినట్లు ఏంటి గ్యారంటీ అంటారా? మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలో రెండు రోజుల క్రితం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, మరో మంత్రి సత్యవతి రాథోడ్, మానుకోట ఎంపీ, ఎమ్మెల్యేలు మాలోత్ కవిత, శంకర్ నాయక్ ల సమక్షంలోనే మంత్రి దయాకర్ రావు చేసిన ఆయా వ్యాఖ్యల వీడియోను దిగువన చూసేయండి.