మీరు చూస్తున్న ఈ ఫొటోలో ఎడమ వైపున బ్లూ కలర్ షర్ట్ ధరించి, కాంగ్రెస్ కండువాతో కనిపిస్తున్న వ్యక్తి… కాదు, కాదు… నాయకుడి పేరు కవాసి లక్మా. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి. తెలంగాణాలోని భద్రాచలం పక్కనే, 60 కిలోమీటర్ల దూరంలో గల కుంట అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కూడా. ఏవో ప్రత్యేక పూజల్లో మంత్రి లక్మా పాల్గొన్నట్లు చిత్రాలు చెబుతున్నాయి కదూ? మంత్రులు, ఎమ్మెల్యేలు గుళ్లూ, గోపురాలు సందర్శించడం, తమ ఆరాధ్య దేవుళ్లను దర్శించుకోవడం, కోరికలు తీరాలని ప్రార్థించడం షరా మామూలే. కానీ ఛత్తీస్ గఢ్ ఎక్సైజ్ మంత్రి లక్మా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నది మాత్రం ఇందుకోసం కానే కాదు. దైవదర్శనంలో భాగం అసలే కాదు. తీరని కోరికలేవో తీర్చాలని దేవుళ్లకు వేడుకోలు అంతకన్నా కాదు. మరి ఎందుకీ ప్రత్యేక పూజలు, ఏమా కథ..? అని ప్రశ్నిస్తే మాత్రం ఆసక్తికర అంశమే. అది తెలుసుకునే ముందు అసలు విషయాన్ని అవగతం చేసుకుంటే ఔరా…? అనిపించక తప్పదు. మంత్రులు ఇందుకోసం కూడా పూజలు చేస్తారా? అని నివ్వెరపోక తప్పదు.
విషయమేమిటంటే…? బోడు రాజా అనే అతను సుక్మా జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆరోగ్యం ఆకస్మాత్తుగా దెబ్బతింది. దీంతో రాజాను తెలంగాణాలోని ఖమ్మం అసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. రాజా అరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. రాజాకు మెదడు ఆపరేషన్ చేయాలని ఆయా కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఇందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. రాజా ఆరోగ్యం దెబ్బతినప్పటి నుంచి అతను కోలుకునే అంశంలో మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మందుల నుంచి చికిత్స వరకు మంత్రి లక్మానే స్వయంగా చూసుకుంటున్నారు.

అంతేకాదు… రాజాకు నిర్వహించే మెదడు ఆపరేషన్ విజయవంతం కావాలని, సంపూర్ణ ఆరోగ్యంతో అతను తిరిగి రావాలని మంత్రి కవాసి లక్మా గుళ్లూ, గోపురాలు తిరుగుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంత్రి సూచన మేరకు మాతా జ్యోతి, పట్కాడై మాతా గుడుల్లో అర్చన కార్యక్రమాలను స్థానిక పూజారులు ప్రారంభించారు. ఆయా పూజల్లో మినిస్టర్ లక్మా స్వయంగా పాల్గొని బోడు రాజా త్వరగా కోలుకోవాలని తమ ఆరాధ్య దేవతలను వేడుకుంటున్నారు.
ఇంతకీ బోడు రాజా గురించి మీకెందుకీ ప్రత్యేక శ్రద్ధ అని మంత్రి లక్మాను ప్రశ్నిస్తే ఆయన ఏమంటున్నారో తెలుసా? ‘ బోడు రాజా నా కుటుంబలో ముఖ్యమైన వ్యక్తి’ అని చెప్పారు. ఇంకా చెప్పాలంటే కుంట నియోజకవర్గంలో లక్మా గెలుపులో బోడు రాజా ఎప్పుడైనా కీలకమే. కుంట ప్రాంతానికే చెందిన రాజా సుక్మా జెడ్పీ వైస్ చైర్మెన్ గా పనిచేయడం ఇది మూడోసారి. లక్మా రాజకీయ జీవితం కోసం అహర్నిశలు పాటుపడే స్థానిక నేతగా రాజాకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఆశ్చర్యం కదూ! సాధారణంగా పెద్ద హోదాలో గల రాజకీయ నాయకుల ఆరోగ్యం క్షీణించినపుడు దిగువ స్థాయి కార్యకర్తలు, స్థానిక నేతలు ప్రత్యేక పూజలు చేయడం, పొర్లు దండాలు పెట్టడం చూస్తుంటాం. కానీ తన ఎదుగుదల కోసం పాటుపడే ఓ దిగువ స్థాయి నాయకుడి క్షేమాన్ని కాంక్షిస్తూ కేబినెట్ హోదా గల మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించడం, వైద్య చికిత్సలను దగ్గరుండి మరీ పర్యవేక్షించడం ఆసక్తికరమే కదా? వార్తల్లో ప్రత్యేకాంశమే కదా?
ఔనూ… మన ప్రాంతాల్లోని అనేక మంది ముఖ్య నాయకుల్లో దిగువ స్థాయి కార్యకర్తల, లీడర్ల పట్ల ఇటువంటి కృతజ్ఞత, విశ్వాసం పెద్దగా కనిపించదేంటి? అని ప్రశ్నిస్తే… కవాసి లక్మా ఆదివాసీ ఎమ్మెల్యే అని ప్రత్యేకంగా ప్రస్తావించక తప్పదు. అదీ ఆదివాసీల రీతి, నీతి అని చెప్పక తప్పదు. మన నాయకులు అనేక మంది అనుసరించాల్సిన, ఆచరించాల్సిన ఓ మంచి మార్గం కూడా అని సూచించక తప్పదు.
ఫొటోలు, సోర్స్: ‘బస్తర్ కీ ఆవాజ్’