తెలంగాణా సీఎం కేసీఆర్ సార్ ప్రకటన చేశాక ఎక్కడైనా తేడా ఉంటుందా? అస్సలు ఉండదు, ఉండకపోవచ్చు కూడా. సార్ ఏది చెప్పినా ‘ఖతర్నాక్’గ ఉంటది. ఇదిగో ఇదే నమ్మకంతో తెలంగాణాలోని లక్షలాది మంది రైతన్నలు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే… ఆ తియ్యటి వార్తను ఆస్వాదించేందుకు సమాయత్తమయ్యారు. విషయమేంటో ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది.
మొన్నీ మధ్యనే… గత నెల 29వ తేదీన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రైతులను మస్తు ఖుషీ జేసే వార్త చెప్పారు… గుర్తుంది కదా? ‘తెలంగాణా రైతులకు తొందర్లోనే తీపి కబురు చెప్తా. అది దేశం ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. వారంలోనే ఈ తీపి కబురు చెబుతాను. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి వార్త చెబుతాను’ అని కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే.
ఈ ప్రకటన చేసి నేటికి సరిగ్గా పన్నెండు రోజులు. ఈ రోజును, ప్రకటించిన రోజును మినహాయించినా ప్రకటన చేసి పది రోజులు గడిచింది. ఇదే దశలో వానాకాలం పంట సేద్యానికి సమయం సమీపించింది. నారు పోసే కాలం రానే వచ్చింది. అందుకే రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు… కేసీఆర్ సార్ చెప్పబోయే ఆ తీపి కబురు కోసం. సీఎం సార్ స్వీట్ న్యూస్ ప్రకటించగానే రెట్టించిన ఉత్సాహంతో పొలాల్లోకి దిగేందుకు రైతులు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.