‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావ్…?’ అంటే ‘దూడ గడ్డి కోసం’ అన్నాడట వెనకటికో ప్రబుద్ధుడు. ప్రపంచ పెద్దన్న, అమెరికా అధ్యక్షుడు ట్రంపన్న తాజా ముచ్చట్లు కూడా ఆయా సామెతనే గుర్తు చేస్తున్నాయి. నల్లజాతీయుడైన జార్జి ఫ్లాయిడ్ ఘటనతో అమెరికా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. నిరసన జ్వాలలు వైట్ హౌజ్ వరకు వ్యాపించి భగ్గుమనడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారేట్లుగా ఉందని గ్రహించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంపును రహస్య ‘బంకర్’లోకి తరలించారు.
ప్రాణభయంతో అమెరికా అధ్యక్షుడు ‘బంకర్’లోకి దూరారనే ప్రచారం ప్రపంచ వ్యాప్తంగా పాకడంతో ట్రంప్ ‘ఇజ్జత్’ పోయినంత పనైంది. మొత్తానికి బంకర్ నుంచి బయటకు వచ్చిన ట్రంప్ ‘ఫాక్స్ న్యూస్’ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? అసలు బంకర్ లోకి వెళ్లడం పెద్ద విషయమే కాదని, తన దగ్గర్లోకి వచ్చి ఎవరూ సమస్యాత్మకంగా ప్రవర్తించలేదని అంటున్నారు. బంకర్ లోకి వెళ్లడం ఇదేమీ తొలిసారి కాదని, గతంలోనూ రెండు, మూడుసార్లు అక్కడికి వెళ్లి వచ్చానని కూడా చెప్పారు. ఈసారి పగటిపూట మాత్రమే వెళ్లానని, ఓ గంట సేపు మాత్రమే బంకర్లో ఉన్నానని వెల్లడించారు.
భారీ ముప్పు ఉన్నట్లు గ్రహిస్తే తప్ప అమెరికా అధ్యక్షులెవరూ ఈ బంకర్లోకి వెళ్లిన దాఖలాలు లేవని చరిత్ర చెబుతోంది. కానీ ట్రంప్ మాత్రం ఇప్పటికే పలుసార్లు బంకర్ లోకి వెళ్లి వచ్చారట. ఆ విషయాన్ని ఆయనే చెబుతున్నారు. బంకర్ లోకి వెళ్లడమనేది పెద్ద అంశమే కాదని ‘సింపుల్’గా తీసిపడేస్తున్నారు. కానీ ‘లోగుట్టు’ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల కెరుక… అంటున్నారు నెటిజన్లు.