‘శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లు’ అనే సామెత గుర్తుంది కదా? ఇదిగో ఈ నానుడిని అన్వయించే విధంగా అగ్రరాజ్యాధినేత, ప్రపంచ పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ బంకర్ లోకి దూరాల్సి వచ్చిందట. విధి వక్రీకరించడం కాక మరేమిటి? భారత్-చైనా సరిహద్దు వివాదంలో తాను తలదూరుస్తానని, మధ్యవర్తిత్వం నెరపుతానని ఈ మధ్యే ట్రంప్ రెట్టించిన ఉత్సాహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్-ఇండియా మధ్య వైరానికి కారణమైన కశ్మీర్ అంశంలోనూ మధ్యవర్తిత్వం వహిస్తానని అప్పుడెప్పుడో కూడా ట్రంప్ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. కానీ కశ్మీర్ అంశంలో ట్రంప్ మధ్యవర్తిత్వానికి ఇండియా, తాజాగా భారత్ తో సరిహద్దు కాంట్రవర్సీలోనూ పెద్దన్న తలదూర్చేందుకు చైనా నిర్దంద్వంగా నిరాకరించాయి.
పిలవని పేరంటానికి వెళ్లిన చందంగా ప్రపంచ సమస్యలన్నింటా తలదూర్చే పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ ప్రాణభీతితో ‘బంకర్’లోకి దూరాల్సిన పరిస్థితి రావడం ఇజ్జత్ పోయే సంగతి కాదా? ఇంతకీ ఏం జరిగిందంటే… ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా అమెరికా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే కదా? నిరసన జ్వాలలు ఏకంగా ‘వైట్ హౌజ్’నే చుట్టుముట్టాయట. నిరసనకారులు శ్వేతసౌధం ముందు బీభత్సం కూడా సృష్టించినట్లు వార్తలు. భాష్పవాయువు ప్రయోగించాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి. సుమారు వెయ్యి మంది వరకు నిరసనకారులు లాఫాయెట్ పార్కుకు చేరుకుని నినదిస్తూ, పోలీసులు రక్షణగా ఉంచిన బారికేడ్లను సైతం ధ్వంసం చేశారట. అమెరికా జాతీయ జెండాను మంటల్లో వేశారట. వైట్ హౌజ్ మీదకు రాళ్లు రువ్వే ప్రక్రియ కూడా షురువైందట. ఇంకేముంది…? పరిస్థితులు చేయిదాటుతున్నట్లు గ్రహించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అగ్రరాజ్యాధినేత ట్రంపును రహస్య బంకర్ కు షిఫ్ట్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
వాస్తవానికిఉగ్రదాడుల ఘటన సందర్భంగా, అత్యవసర సమయాల్లో మాత్రమే ఇటువంటి రహస్య ‘బంకర్’ను ఉపయోగిస్తారు. అమెరికా వంటి అగ్ర రాజ్యధినేత ‘బంకర్’లో తలదాచుకునే పరిస్థితులు రావడం అత్యంత అరుదు. కానీ జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఘటన ట్రంపును బంకర్ వైపు పరుగెత్తేలా చేసింది. అమెరికాలో తాజా ఉద్రిక్త పరిస్థితులకు ఇది అద్దం పడుతోందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు ట్రంప్ ‘బంకర్’లోకి దూరిన ఘటనపై ట్విట్టర్ లో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ ట్వీట్ ను దిగువన చూడండి.