యావత్ దేశం ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణా రైతుకు సీఎం కేసీఆర్ ప్రకటించబోయే కొత్త వరం ఏమిటి? ఆ పథకం పేరేమిటి? సార్ సరికొత్త యోచన ఏమిటి? ఇవీ రాష్ట్రవ్యాప్తంగా అధికారగణమే కాదు, పరిశీలకులు, ప్రజలు తమ తలలు నిమురుకుంటున్న ప్రశ్నలు. నిన్న కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ను ప్రారంభించిన సందర్భంగా కేసీఆర్ చేసిన ‘తీపి కబురు’ వ్యాఖ్యలు తెలంగాణా రాష్ట్రంలోనే కాదు, ఇరుగు, పొరుగు రాష్ట్రాల్లోని పాలక వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠకు హేతువయ్యాయి. ‘తెలంగాణా రైతులకు తొందర్లోనే తీపి కబురు చెబుతాను. అది దేశం ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది’ అని సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశంపై తెలంగాణాకు చెందిన వ్యవసాయ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
వాస్తవానికి ఈ అంశంలో తమకూ స్పష్టత రావడం లేదనివ్యవసాయ అధికారులు చెబుతున్నారు. తమ నుంచి ప్రభుత్వం కొత్తగా ఎటువంటి ప్రతిపాదనలను కూడా తాజాగా కోరలేదని రెండు, మూడు జిల్లాల్లోని వ్యవసాయ శాఖకు చెందిన ఉన్నతాధికారులే కాదు, మండల స్థాయి అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ రైతుకు ప్రకటించే కొత్త వరంపైనే జోరుగా చర్చలు, ఊహాగానాలు సాగుతున్నాయి. రైతుబంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ, తదితర అంశాలన్నీ పాతవే.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ‘తీపి కబురు’ వ్యాఖ్యను బేస్ చేసుకుని రెండు, మూడు అంశాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అందులో మొదటిది రెవెన్యూ శాఖ రద్దు ప్రతిపాదనను అమలు చేయడం. వాస్తవానికి ఇది కొత్త ప్రతిపాదన కాదు. రెవెన్యూ శాఖను రద్దు చేయడం వల్ల రైతుకు తీపి కబురుగా భావించలేమంటున్నారు. ఈ విషయం జనం నోళ్లలో నానుతున్నదేనని అంటున్నారు. ఇక రెండోది ‘ధరణి’ అమలు అంశం. కోర్టు వివాదాల్లో గల దాదాపు 10 శాతం భూములు మినహా, మిగతా 90 శాతం భూములకు ‘ధరణి’ని అమలు చేస్తునే ఉన్నారు. ఇది కూడా కొత్తదేమీ కాదంటున్నారు.
ఇక మిగిలిన మూడో అంశం కాస్త ఆసక్తికరమే. పంట సేద్యం చేసే రైతుకు ఉచితంగా ఎరువులు, పురుగు మందులను ఇస్తారనేది. ఈ విషయంలోనూ గతంలో వార్తలు వచ్చినప్పటికీ బహుషా అమలు చేసేందుకు సీఎం సంసిద్ధమై ఉంటారని వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ, రైతుకు ఎరువులు, విత్తనాలను కూడా ఉచితంగా ఇవ్వడం దేశం అశ్చర్యపోయే అంశమే అవుతుందని అంచనా వేస్తున్నారు. లేనిపక్షంలో భూమి యజమానికి ఓ వైపు రైతుబంధు ఇస్తూనే, మరోవైపు కౌలు రైతును సైతం ఆదుకునేందుకు ఏదైనా సరికొత్త ఆలోచన చేసి ఉంటారా? అని కూడా సందేహిస్తున్నారు. మొత్తంగా కేసీఆర్ ‘తీపి కబురు’ వ్యాఖ్య ప్రస్తుతం ఆసక్తికర టాపిక్.