అబ్బే.. పత్రికను ఎలా నడపాలో రామోజీరావుకు రాదండీ! ఎక్కడో విశాఖ తీరాన పత్రికను ప్రారంభించి దేశవ్యాప్త కీర్తి పతాకగా దాన్ని తీర్చి దిద్దిన రామోజీకి ఇప్పటికీ ‘ఈనాడు’ను ఎలా నడపాలో తెలియడంలేదు. మూతబడ్డ ఆంధ్రజ్యోతిని పునఃప్రారంభించి నడుపుతున్న వేమూరి రాధాకృష్ణకు సైతం పత్రికా నిర్వహణ గురించి తెలియదండీ!!
అసలు ఫస్ట్ పేజీలో ఏ వార్త ఎక్కడ పెట్టాలి? ఏ వార్తను ‘బ్లాస్ట్’ చేయాలి, మరే వార్తను ‘అండర్ ప్లే‘గా ప్రచురించాలో కూడా వాళ్లకేం తెలుసు? ఒకే పత్రికకు ఇద్దరు ఎడిటర్లు ఏంటండీ… ఎక్కడైనా ఉంటారండీ? ఆంధ్రాకో ఎడిటరట. తెలంగాణాకో ఎడిటరట. జగన్ పెట్టే కేసులకు భయపడి, ఒకే పత్రికకు ఇద్దరేసి ఎడిటర్లను పెట్టేసి, రామోజీ ఇలా దాక్కుంటున్నాడు తెలుసా?
ఇక సాక్షి పత్రికను జగన్మోహన్ రెడ్డి ఏనాడో వదిలేశాడు తెలుసా? కోట్లకు కోట్లు గుమ్మరించి అతనెవరో ఉత్తరాది వ్యక్తిని తీసుకువచ్చి పెత్తనం ఇచ్చాడు. పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి జేబు నింపుతున్నాడు. జగన్ పాలనను ఎలా వెనకేసుకురావాలో ఇప్పటికీ సాక్షి బాధ్యులకు తెలియడం లేదు.
‘ఎహె…’ ఆ నమస్తే తెలంగాణాను కేసీయార్ ఎప్పుడో వదిలేశాడు. దాన్ని మూయలేక, నడపలేక సీఎం సారు నరకయాతన అనుభవిస్తున్నాడు తెలుసా? ఎన్ని డాన్సులు చేసినా ‘నమస్తే’ పత్రిక తెలంగాణాలో ఎప్పటికీ నంబర్ వన్ కాలేదు.
ఇక ఎలక్రానిక్ మీడియా అధిపతులకు న్యూస్ ఛానల్ నడపడం రావడం లేదు. ఇప్పటికీ ఆంధ్రా వాసనలు పోలేదు. తెలంగాణా సువాసనను అసలే ఒంట బట్టించుకోలేదు.
సోషల్ మీడియా వార్తలు శుద్ధ తప్పు. మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తల్లో సర్వం డొల్లతనం. వాళ్లకు ప్రెజెంటేషన్ తెలియదు. ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లకు ‘ప్రోమో’ కట్ చేయడం కూడా రావడం లేదు.
కరోనా వచ్చింది. పత్రికలను ఎవడూ చడవడం లేదు. అసలు కొనడమే మానేశారు తెలుసా? అపార్ట్మెంట్ల ముందు గుట్టలు గుట్టలుగా పత్రికలు పడి ఉంటున్నాయి. సర్క్యులేషన్ దారుణంగా పడిపోయింది. ప్రింట్ మీడియా పనైపోయింది. ఇక రాబోయే కాలమంతా ‘నా’ మీడియాదే. శకం నాదే, యుగం నాదే. ఈ విశ్వంలో సర్వం నాదే. భవిష్యత్తు నాకు మాత్రమే ఉంది. వేరెవరికీ లేదు. రామోజీ మళ్లీ పచ్చళ్లు అమ్ముకోవలసిందే. రాధాకృష్ణ మళ్లీ నిజామాబాద్ వైపు వలస వెళ్లాల్సిందే. మరి సాక్షి, నమస్తే తెలంగాణా పత్రికల సంగతి అంటారా? అధికారం ఉన్నన్నాళ్లు వాటి అధిపతులు ఆ పత్రికలను నడుపుతారు. తర్వాత మూసేయవచ్చు.
ఎలక్ట్రానిక్ మీడియా వార్తలను ప్రజలు పట్టించుకోవడం మానేశారు. న్యూస్ ఛానళ్లు చూడడం కూడా జనం మానేశారు. వినోదాత్మక ఛానళ్లు మాత్రమే చూస్తున్నారు. అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయ్. ఏబీసీ లెక్కలు, టీఆర్పీ, బార్‌కు రేటింగుల ‘కత’ మొత్తం మాకు మాత్రమే తెలుసు. ఇంకెవడికీ తెలియదు. అన్ని మీడియాల వాళ్లు నెట్టింట్లో ఫొటోలను వాడుతూ ఏదేదో రాసేస్తున్నారు. మేం మాత్రమే సొంతంగా ఫొటోలు, వీడియోలు తీయిస్తున్నాం తెలుసా? లచ్చల రూపాయాలు మా వద్ద పనిచేసే వాళ్లకు జీతాలుగా కూడా ఇస్తున్నాము. ‘ఎహె…’ మేం చెప్పేదే నిజం. మాదే ఇజం. మేం రాసేదే జర్నలిజం. మాకు తప్ప ఎవడికీ అక్షర ‘గ్నానం’ లేదు తెలుసా? ఫేస్ బుక్కుల్లో వాటి రాతగాళ్లకు మాట మాత్రం చెప్పకుండా ‘లిఫ్ట్’ చేసి మా కోసమే వాళ్లు రాస్తున్నట్లు భ్రమింపజేసే సత్తా మాకు తప్ప మరెవడికీ లేదు తెలుసా?
వారెవ్వా…! రామోజీకి పేపర్ నడపడం రాదా? రాధాకృష్ణకు తెలియదా? జగన్ సాక్షిని పట్టించుకోవడం మానేశాడా? కేసీఆర్ సారు ‘నమస్తే’ తెలంగాణా గురించి మర్చిపోయాడా? ఏంటీ ఇదంతా అనుకుంటున్నారు కదూ! ఈ మధ్య కాలంలో పత్రికల నిర్వహణ, దాని తీరుతెన్నులపై అదేదో మీడియా(?)లో ‘సుద్ద’పూస రాతలు మరీ ఎక్కువయ్యాయి లెండి. అటు ప్రింట్ మీడియాను, ఇటు ఎలక్ట్రానిక్ మీడియాను, ఇంకోవైపు సోషల్ మీడియాను తాము ‘దునుమాడుతున్నట్టు’ కొందరు రాతగాళ్లు తెగ మచ్చట పడిపోతున్నారు. ఓ రకంగా ‘మీడియా’కు శాపనార్థాలు కూడా పెడుతున్నారు. ప్రస్తుతం మాదే అసలైన మీడియాగా ఆత్మస్తుతి చేసుకుంటూ, అదే పనిగా పరనిందకు దిగుతూ తమ అచ్చట ఇలా తీర్చుకుంటున్నారు.
‘ఫోనీ…’ రామోజీ, రాధాకృష్ణలతోపాటు జగన్, కేసీఆర్ పత్రికల్లో ఇటువంటి వాళ్లకోసారి ఛాన్స్ ఇస్తే ‘ఫోలా’? వాళ్లకు చేతగాని పనులను ఈ రాతగాళ్లు చేస్తారేమో? మంత్రదండం ఏదైనా ఉందేమో? ఆ పత్రికలను ప్రపంచంలోనే ‘నెంబర్ వన్’గా తీర్చి దిద్ది ఉద్ధరిస్తారేమో.. అంటారా? ఆ ముచ్చటా వీళ్లకు తీరింది లెండి. అక్కడా, ఇక్కడా అనే భేదం లేకుండా దాదాపు అన్ని చోట్లా ఇటువంటి రాతగాళ్లు దశాబ్ధాల క్రితమే ఆయా సంస్థల్లో కాస్త పెద్ద కుర్సీలోనే తమ ‘ఫాదం’ మోపిన చరిత్ర ఉండనే ఉంది. మరి వీళ్ల చేతుల్లో ఆయా సంస్థలు బాగుపడలేదా? అని మాత్రం ప్రశ్నించకండి. ఎందుకంటే…? ఆ ఒక్కటే అడక్కండి.
‘ఫోనీ, సఫోజ్… ఫర్ సఫోజ్…’ ప్రింట్ మీడియా పనైపోయింది. ఎలక్ట్రానిక్ మీడియాను ప్రజలు పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియా రాతలు బూటకం, డిజిటల్ మీడియా దారుణం… అనుకుందాం కాసేపు. ఇంతకీ ఇటువంటి రాతగాళ్లది ఏ మీడియా… అంటారా? ‘జస్ట్ ఆస్కింగ్…’ అని నిలదీస్తున్నారా? ఏమో ఆయా మీడియాల్లో ఏదీ కాని మీడియాాను ఎలా పరిగణించాలో తెల్వద్ మరి.