ఉపాధి హామీ పథకం… దీని అమలు తీరు తెన్నులపై ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. కూలీల ఉపాధే ప్రామాణికంగా అమలు చేస్తున్న ఈ పథకంలో అవినీతి దందా అంతా ఇంతా కాదనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. సదుద్ధేశంతో ప్రారంభించిన ఈ పథకం తీరు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందనే చందంగా తయారైందనే విమర్శలూ లేకపోలేదు. ఫీల్డ్ అసిస్టెంట్లను దూరం చేసిన ఈ పథకంలో తాజాగా టెక్నికల్ అసిస్టెంట్లు (టిఎ) దండుకుంటున్నారు. కూలీల హాజరు పట్టీలు (మష్టర్ రోల్స్) నింపే మేట్లు గూగుల్ పే ద్వారా టిఎలకు పంచుడు కార్యక్రమానికి తెర తీయగా, టిఎలు అకౌంట్ నెంబర్లు ఇస్తూ మరీ దంచుకుంటున్నారు.
అనేక అక్రమాలు, అవినీతి ఆరోపణలకు ఆలవాలంగా మారినట్లు ప్రచారంలో గల ఉపాధి హామీ పథకం అమలులో కొంత కాలం క్రితమే ఫీల్డ్ అసిస్టెంట్లు దూరమైన సంగతి తెలిసిందే. నిబంధనల చట్రంలో కష్టాలు, సమ్మె… ఇదే దశలో కరోనా కల్లోలం తదితర పరిణామాల్లో ఉపాధి హామీ పథకం అమల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రమేయం లేకుండాపోయింది. దీంతో టెక్నికల్ అసిస్టెంట్ల పేరుతో మరో విభాగానికి చెందిన సిబ్బందిని ప్రభుత్వం రంగంలోకి దించింది.
మరి వీళ్లేం చేస్తున్నారయ్యా…? అంటే మష్టర్ రోల్స్ నిర్వహించే మేట్లతో మిలాఖత్ అవుతున్నారు. గూగుల్ పే అకౌంటుకు ‘అమ్యమ్యా’లను ట్రాన్స్ ఫర్ చేయాలని కూడా చెబుతున్నారు. అడిగినంతా ట్రాన్స్ ఫర్ చేస్తాం కానీ… కూలీ మొత్తాన్ని మాత్రం ‘టాప్’లో ఉంచాలని కోరుతున్నారు. ఆడియో వినబోతూ పూర్తి వివరాలెందుకు? ఖమ్మం జిల్లాలోని ఓ పంచాయతీ టిఎకు, ఈజీఎస్ పథకం ‘మేట్’కు మధ్య జరిగిన కరెన్సీ నోట్ల పంచుడు దందా సంభాషణ ఏమిటో దిగువన మీరే వినండి.