తెలంగాణాలో కేసీఆర్ తో ఇక ప్రత్యక్ష రాజకీయ యుద్ధానికే బీజేపీ సన్నద్ధమైందా? టీఆర్ఎస్ పార్టీతో తమ పార్టీకి లోపాయికారీ స్నేహం ఉందనే ప్రచారానికి బీజేపీ నాయకత్వం ఫుల్ స్టాప్ పెట్టబోతున్నదా? తెలంగాణాకు చెందిన బీజేపీ అగ్రనేతలు గత 24 గంటల వ్యవధిలోనే కేసీఆర్ పై విరుచుకుపడుతున్న తీరు ఇందుకు బలం చేకూరుస్తోంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నేతలు తెలంగాణా అధికార పార్టీ చీఫ్ పై విమర్శల దాడి తీవ్రతను పెంచడం గమనార్హం.
నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీఎం కేసీఆర్ స్వరం పెంచి తనదైన యాసలో చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేతల అగ్రహానికి కారణమైనట్లు కనిపిస్తోంది. పరస్పర రాజకీయ విమర్శలు, వ్యాఖ్యల సంగతి ఎలా ఉన్నప్పటికీ ‘కేసీఆర్ అకౌంట్లో డబ్బులు వేస్తేనే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లా?’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రశ్నించిన తీరు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. గ్రామ పంచాయతీలు, రైతు బంధు పథకం తదితర అంశాల్లో కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని కిషన్ రెడ్డి లోతుగానే దుయ్యబట్టారు.
అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు సైతం కరోనా కట్టడి అంశంలో పరోక్షంగా కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. నిన్న కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనాతో సహజీవనం చేయాలని కొందరు నేతలు చెబుతున్నారని, అది సరైంది కాదన్నారు. ‘అసలు కరోనాతో సహజీవనం చేయడమేంటి? చేతగాక కొందరు కరోనాతో సహజీవనం చేద్దామంటున్నారు’ అని విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించడం రాజకీయంగా కలకలానికి దారి తీసింది. ‘తేలు మంత్రం వచ్చినోడు పాము నోట్లో వేలు పెట్టిన’ చందంగా కొందరు నేతల ‘సహజీనవం’ వ్యాఖ్యలను విద్యాసాగర్ రావు అభివర్ణించడం గమనార్హం.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తనదైన శైలిలోనే కేసీఆర్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. ‘కేంద్రం పైసలిస్తే మీ జేబులు నింపుకోవాలని చూస్తున్నారా? అభివద్ధి పేరుతో కమీషన్లు దండుకుందామనా? కేంద్రం డబ్బులను తలా కొంత పంచుకోవాలని కొందరు రాంబందుల్లా ఎదురు చూస్తున్నారు’ అని సంజయ్ వ్యాఖ్యానించారు.
మొత్తంగా టీఆర్ఎస్ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ వ్యవహార శైలిని లక్ష్యంగా చేసుకుని తెలంగాణాకు చెందిన బీజేపీ అగ్ర నేతలు చేస్తున్న వ్యాఖ్యల తాజా దాడి సహజంగానే రాజకీయ చర్చకు దారి తీసింది.