కొత్త సంవత్సరం వేళ విషాద ఘటన చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్లోని మాతా వైష్ణోదేవి దేవాలయంలో శనివారం ఉదయం జరిగిన తొక్కిసలాట ఘటనలో 12 మంది భక్తులు మృతి చెందగా, మరో 20 మంది వరకు గాయపడ్డారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆలయంలో తెల్లవారు జామున 2.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
దేవీ దర్శనం, పూజల కోసం భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో అనూహ్యంగా తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో చనిపోయినవారంతా దిల్లీ, హరియాణా, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల వారిగా గుర్తించారు.
కాగా ఈ తొక్కిసలాట ఘటనలో 12 మంది మృతి చెందడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.