ఫొటోలో మీరు చూస్తున్న ఈ తాత పేరు చిటేట్సు వతనాబే. వయస్సు 112 ఏళ్లు మాత్రమే. ఔను… మీరు చదువుతున్నది కరెక్టే. ఈ తాత వయస్సు అక్షరాలా నూట పన్నెండు సంవత్సరాలు. జపనీయుడైన చిటేట్సు వతనాబే ప్రపంచంలోనే అత్యంత వృద్ధ్యాప్య పురుషునిగా పట్టాభిషేక సత్కారాన్ని పొందడం విశేషం. టోక్యోకు ఉత్తర దిశలో గల నీగాటాలో 1907 మార్చి 5వ తేదీన జన్మించిన చిటేట్సు వతనాబేను నగరంలోని ఓ నర్సింగ్ హోంలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ్యాప్యం గల పురుషునిగా బిరుదును పొందినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకటించింది. వివాహితుడైన వతనాబేకు భార్య, ఐదుగురు సంతానం కూడా ఉన్నారు.
కస్టర్డ్ ఫుడ్ వంటి స్వీట్లను కూడా ఆహారంగా తీసుకున్న తనకు వాటివల్ల ఎటువంటి హాని జరగలేదని వతనాబే ప్రకటించడం విశేషం. గతంలో ఇటువంటి రికార్డును సొంతం చేసుకున్న జపాన్ వాసి మసాజో నోనాకా గత నెలలో 112 సంవత్సరాల 266 రోజుల్లో మరణించడం గమనార్హం. ప్రపంచంలోనే ఎక్కువ ఆయుష్షును కలిగిన వృద్ధులను కలిగిన నగరంగా జపాన్ కు పేరుంది. ఇప్పటి వరకు ఎక్కువ సంవత్సరాలు జీవించిన వృద్ధ్యాప్య మనుషుల్లో జిరోమాన్ కిమురా 116వ జన్మదినం అనంతరం 2013 జూన్ లో మరణించినట్లు రికార్డు ఉంది. గిన్నిస్ లెక్కల ప్రకారం ఫ్రాన్స్ కు చెందిన జీన్ లూయిస్ కాల్మెంట్ 122 ఏళ్ల వయస్సులో 1997లో మరణించారు. ఇదిలా ఉండగా ‘కోపం తెచ్చుకోకుండా, చిరునవ్వు మోముతో జీవించడం’ తన దీర్ఘాయుష్షు వెనుక గల రహస్యంగా చిటేట్సు వతనాబే వెల్లడించడం అసలు విశేషం.
-హిందుస్తాన్ టైమ్స్ సౌజన్యంతో…