కేరళలో వెలుగు చూసిన ‘జికా’ వైరస్ కేసులతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం నాటికి ఈ రాష్ట్రంలో 14 జికా వైరస్ కేసులు నిర్ధారణ కావడం ఆందోళనకర పరిణామంగా భావిస్తున్నారు. తొలి జికా వైరస్ కేసును 24 ఏళ్ల వయస్సు గల ఓ గర్భిణీలో నిన్న కనుగొన్నట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 19 అనునమానిత జికా వైరస్ శాంపిళ్లను పుణెలో గల జాతీయ వైరాలజీ సంస్థకు పరీక్షల కోసం పంపించారు.
ఇందులో 13 మందికి జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ జరిగినట్లు కేరళ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దీంతో కేరళ ప్రభుత్వం ఒక్కసారిగా అలర్టయింది. జికా వైరస్ ను నియంత్రించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. కేరళలో వెలుగు చూసిన జికా వైరస్ కేసుల సంఖ్య నేపథ్యంలో ఇరుగు, పొరుగు రాష్ట్రాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. డెంగీ జ్వరం టైపు లక్షణాలే దాదాపుగా ఉన్న జికా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా దోమలు కుట్టకుండా అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.