రాజకీయాన్ని, నక్సలిజాన్ని ఒకే గాటన కట్టే పోలిక కాదిది. ఒక్కోసారి సందర్భాన్ని బట్టి కొన్ని పోలికలు అనివార్యమవుతాయి. సంఘటన అందుకు అవకాశం కల్పిస్తుంటుంది. ఎందుకంటే అది ‘రాజకీయం…’ ప్రత్యర్థులను తమ వ్యూహాలతో చిత్తు చేసే ఎత్తుగడ అయి ఉండవచ్చు. లేదా తమకు ప్రాతినిధ్యం పెద్దగా లేని ప్రాంతాల్లో పట్టు సాధించే ప్రక్రియ కావచ్చు. అనుమానం రేకెత్తినపుడు తాము అక్కున చేర్చుకున్న నేతలను పార్టీ అధినేతలే పొమ్మనకుండా పొగబెట్టిన ఘటనలు అనేకం చూస్తున్నాం కదా? రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు… రాజకీయం…నక్సలిజం… దేని దారి దానిదే…కానీ ప్రత్యర్థులను నిలువరించే వ్యూహం మాత్రం ఖచ్చితంగా ‘రాజకీయమే’…. అది ఎక్కడైనా కావచ్చు…ఇక అసలు కథనం చదవండి…

సరిగ్గా 30 ఏళ్ల క్రితం వరంగల్ జిల్లాలో ఓ పోలీసు అధికారి ఉండేవారు…అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్ల కార్యకలాపాలను నియంత్రించే లక్ష్యంతో ఉన్నతాధికారులు ఆయనను ప్రత్యేకంగా దండకారణ్యంలోని ఓ పోలీస్ సర్కిల్ కు బదిలీ చేశారు. విధుల్లో చేరిందే తడవుగా ఆయనేమీ అక్కడ హడావిడి చేయలేదు. నక్సలైట్ల అంతు చూస్తానని బీరాలు కూడా పలకలేదు. వీలైనంత ఎక్కువ సమయం తన ఆఫీసులోనే కూర్చుని పరిస్థితిని నిశితంగా పరిశీలించేవారు. ఓ అయిదారు నెలలు ఇలాగే ఉన్నారు. ఈయనేదో చేస్తాడని ఉన్నతాధికారులు ఇక్కడికి పంపిస్తే, హాయిగా స్టేషన్ కు ఇతరులను పిలిపించుకుని కబుర్లు చెబుతూ, చాయ్, కాఫీలు తాగుతూ కాలక్షేపం చేస్తున్నారేమిటి? అని పోలీసు సిబ్బంది చెవులు కొరుక్కునేవారు. వాస్తవానికి ఆ సీఐ తుపాకీ తీసి నక్సలైట్లపై కాల్పులు జరిపిన సంఘటనలు కూడా అరుదే…పైగా పీపుల్స్ వార్ నక్సలైట్ల సానుభూతిపరులను, కొరియర్లను, మిలిటెంట్లను, ఆర్గనైజర్లను స్టేషన్ కు పిలిపించి పిచ్చాపాటి కబుర్లు చెబుతూ వారికి టీ, కాఫీలు ఇప్పించేవారు. కొన్ని సందర్భాల్లో స్టేషన్ ఎదురుగానే గల హోటల్ నుంచి చికెన్, మటన్ తో కూడిన భోజనాలు కూడా తెప్పించి వారి కడుపు నింపి పంపించేవారు. స్టేషన్ బయటకు వచ్చి వారికి చేయి ఊపుతూ సీఐ వారిని పంపించేవారు. ఈ సీన్ ను పరిసరాల్లోని ప్రజలు చూస్తుండేవారు కూడా.  సీఐ సాబ్ మర్యాద చూసి పీపుల్స్ వార్ పార్టీ సానుభూతిపరులు, మిలిటెంట్లు, కొరియర్లు మహా ఆనందపడేవారు. ‘సీఐ సాబ్ చాలా మంచోడు…మమ్మల్ని ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు’ అని వారు సంబరపడేవారు. కానీ ఆ పోలీసు అధికారి అసలు వ్యూహం అక్కడే ఉంది. తాను ఏదైతే ఆశించి పీపుల్స్ వార్ కేడర్ కు మర్యాద చేశారో…అందుకు అనుగుణంగానే ఫలితాలు వచ్చాయి. సీఐ వద్ద మర్యాద తీసుకున్న వారిపై పోలీస్ ఇన్ఫార్మర్లుగా వాల్ పోస్టర్లు పడ్డాయి. కరపత్రాలు వెలువడ్డాయి. సీఐతో రాసుకుపూసుకుని తిరిగినవారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అప్పట్లో పీపుల్స్ వార్ నక్సల్ నాయకులు ప్రకటించారు. ఫలితంగా వందలాది మంది సానుభూతిపరులు, కొరియర్లు, మిలిటెంట్లు పార్టీకి దూరం కావలసిన అనివార్య స్థితి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ముద్ర కూడా వేయించుకున్నారు. ఇది పోలీసు అధికారి వ్యూహం. పక్కాగా ఫలించింది. అనేక మంది ముఖ్యులను పార్టీకి దూరం చేయడంలో ఆ సీఐ సఫలమయ్యారు. ఇదీ ఓ టైపు రాజకీయమే. కేవలం ‘మర్యాద’ ద్వారా అవతలివారికి ఎక్కడా లేని అనుమానాన్ని క్రియేట్ చేసే స్ట్రాటజీ అన్నమాట. ‘అన్ని సందర్భాల్లో తుపాకీ గర్జించాల్సిన అవవసరం లేదు…కొన్నిసార్లు వ్యూహం కూడా సత్ఫలితాలు ఇస్తుంది’ అని ఆ పోలీసు అధికారి నిరూపించారు. ఇది సినిమా సీన్ కాదు… ఏటూరునాగారం దండకారణ్యంలో జరిగిన యదార్థ ఉదంతమిది.

ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం…ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఇంగ్లీష్ మీడియంపై వస్తున్న విమర్శలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తోపాటు వైఎస్ఆర్ సీపీ నేతలు భగభగమంటున్నారు కదా… ఇది చాలదన్నట్లు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలుగు భాష గురించి పార్లమెంట్లో చేసిన ప్రసంగంపై సీఏం జగన్ మరింత ఆగ్రహించినట్లు వార్తలు వచ్చాయి. అసలు ఆయన సంగతేంటో కనుక్కుని క్లాస్ తీసుకోవాలని ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించారు. తనకు తెలుగంటే ఇష్టమని, ప్రభుత్వ విధానానికి వ్యతిరేకం కాదని ఎంపీ వివరణ ఇచ్చినా అధికార పార్టీలో వివాదం సద్దుమణిగిన దాఖలాలు కనిపించడం లేదు. పైగా వైఎస్ఆర్ సీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు బీజేపీ ట్రాప్ లో ఉన్నారని, వారు బీజేపీ అగ్ర నేతలతో టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లే సమయంలో విజయసాయిరెడ్డి లేదా మిథున్ రెడ్డిలతో కలిసి వెళ్లాలని సీఎం జగన్ సూచించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

ఇదిగో…ఈ పరిస్థితుల్లో సాక్షాత్తూ దేశ ప్రధాని వైఎస్ఆర్ సీపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ‘రాజుగారూ…అంతా బాగుంది కదా?’ అని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పలకరించి, ప్రశ్నించిన వార్త ఇప్పడు ఏపీ అధికార పార్టీలో హాట్ టాపిక్. ఎక్కడో… ఏదో జరుగుతోందని వైసీపీ పార్టీలో కలవరం కలుగుతున్నదట. ఇది రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య. కానీ ఆ పార్టీ వర్గాలు మాత్రం ఈ ఘటనను లైట్ గా తీసుకుంటున్నాయట. దేశంలోని ఎంపీలను ప్రధానిగా మోదీ గుర్తు పెట్టుకుని పలకరిస్తే తప్పేమిటి? ఇందులో విపరీత అర్థం, అనుమానాలకు అవకాశం ఏముంది? అని ఎదురు ప్రశ్నిస్తున్నాయట. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి మాత్రం ఓ బాంబు పేల్చారు. వైఎస్ఆర్ సీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు ఆయన ప్రకటించారు. మొత్తం ఎపీసోడ్ లో అసలు విషయం ఏమిటో తెలుసా… రఘురామ కృష్ణంరాజు తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గల పారిశ్రామికవేత్తే. ఎక్కడో ఏదో తేడా కొట్టి నేరుగా జగన్ తీరుపై ఘాటు విమర్శలు చేసి బీజేపీలో చేరారు.  గత సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు కూడా ‘రాజుగారు’ బీజేపీలోనే ఉన్నారు. ఎన్నికల సమయంలోనే జగన్ ఆయనను తన పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇవ్వగా, రాజుగారు ఆ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు.

Comments are closed.

Exit mobile version