ఖమ్మం జిల్లాలో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి కూల్చివేశారు. తెలంగాణాలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రాజన్న రాజ్యం తీసుకురావాలని వైఎస్ కూతురు షర్మిల సన్నద్ధమవుతున్న నేపథ్యంలో స్వయంగా ఆమె ఆవిష్కరించిన విగ్రహాన్ని ఆనవాళ్లు లేకుండా ధ్వంసం చేయడం కలకలానికి దారి తీసింది. ఖమ్మం నగర శివార్లలోని రఘునాధపాలెం మండలం శివాయిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
దాదాపు ఎనిమిదేళ్ల క్రితం వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ‘మరో ప్రజాప్రస్థానం’ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2013 ఏప్రిల్ 27న శివాయిగూడెంలో దివంగత సీఎం వైఎస్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు, ఖమ్మం నియోజకవర్గ కోఆర్డినేటర్, ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా, అప్పటి ఖమ్మం పార్లమెంట్ పరిశీలకుడు, ప్రస్తుత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతిథిగా హాజరయ్యారు.
అయితే ఈ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి కూల్చేశారు. జేసీబీతో విగ్రహాన్ని ఆనవాళ్లు లేకుండా చేసినట్లు ఘటనా స్థలంలో కనిపిస్తోంది. త్వరలోనే ఖమ్మం జల్లాలో షర్మిల పర్యటన ఖరారు కానున్న నేపథ్యంలో వైఎస్ విగ్రహ ధ్వంసం ఘటన రాజకీయంగా చర్చకు దారి తీసింది.