దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రాజకీయ పార్టీని స్థాపిస్తారా? పార్టీ పేరేమిటి? అందుకు గల కారణాలేమిటి? అసలు షర్మిల లక్ష్యం ఏమిటి? తెలంగాణాలోనే ఆమె ఎందుకు పార్టీని ఏర్పాటు చేస్తున్నారు? జగన్ పై ఆగ్రహం కలిగితే ఆంధ్రాలో కదా పార్టీ ఏర్పాటు చేయాల్సింది? పార్టీని ఏర్పాటు చేస్తే ఆమె వెనుక నడిచే తెలంగాణా రెడ్లు ఎవరు? గుడాటి రెడ్లా, మొటాటి రెడ్లా? క్రిస్టియన్ రెడ్లా? పాకనాటి రెడ్లా? పెడకంటి రెడ్లా? దేశ్ ముఖ్ లా? లేదంటే హైదరాబాద్ లో గల రాయలసీమ రెడ్లా? షర్మిల కదలికల వెనుక గల ముఖ్య రెడ్డి నేతలెవరు? ఇవి కాదు అసలు ప్రశ్నలు. వైఎస్ షర్మిల రాజకీయ కదలికలపై మీడియా ఎలా స్పందిస్తోంది. షర్మిల మంగళవారం నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశం గురించి ఏ పత్రిక ఎలా స్పందించింది? ఇదీ జర్నలిస్టు సర్కిళ్లలో సాగుతున్న చర్చ.
వాస్తవానికి వైఎస్ షర్మిల రాజకీయ కదలికలపై ఆంధ్రజ్యోతి మీడియా గ్రూపు సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ గతనెల 24వ తేదీన తన ‘కొత్తపలుకు’ కాలమ్ ద్వారా తొలుత వార్తా కథనాన్ని ప్రచురించారు. ఆంధ్రజ్యోతి కథనంపై షర్మిల సీరియస్ కూడా అయ్యారు. న్యాయపరమైన చర్యలకు వెనుకాడేది లేదని కూడా ఓ ప్రకటన జారీ చేశారు. కానీ తాను పార్టీ స్థాపించడం లేదని ఆమె తన ప్రకటనలో మాత్రం పేర్కొనలేదు. అదంతా వేరే విషయం. షర్మిల పార్టీ ఏర్పాటు చేస్తారా? లేదా? అనే అంశం అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా స్తబ్దుగానే ఉంది. కానీ సోమవారం షర్మిల పార్టీ గురించి మళ్లీ కదలిక మొదలైనట్లు వార్తా కథనాలు వచ్చాయి. తెలంగాణాలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలకు షర్మిల నేరుగా ఫోన్లు చేసి మరీ సంభాషించినట్లు సమాచారం. ఆత్మీయ సమావేశానికి రావలసిందిగా పలువురికి ఆహ్వానాలు అందాయి. లోటస్ పాండ్ లో ఈమేరకు ఆత్మీయ సమావేశాల నిర్వహణకు రంగం కూడా సిద్ధం చేశారు.
అయితే రాజకీయంగా షర్మిల కదలికలపై విషయాన్ని ఏ పత్రిక ముందు వెల్లడించినప్పటికీ, తాజాాగా మాత్రం దాదాపు అన్ని పత్రికలు ఆమె పార్టీ గురించి తమదైన శైలిలో కథనాలు అందించాయి. తాము చెప్పిందే జరుగుతోందని ఆంధ్రజ్యోతి పత్రిక ‘క్రెడిట్’ తీసుకోగా, అత్యధిక సర్క్యులేషన్ ఏబీసీ సర్టిఫికెట్ గల ‘ఈనాడు’ కూడా షర్మిల ఆత్మీయ సమావేశం గురించి ప్రముఖంగానే ప్రచురించడం గమనార్హం. తెలంగాణాలోనే పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలోనూ టీఆర్ఎస్ పార్టీ కరదీపికగా ప్రాచుర్యం పొందిన ‘నమస్తే తెలంగాణా’ కూడా షర్మిల నిర్వహించే సమావేశం గురించి మెయిన్ ఎడిషన్ లోపలి పేజీల్లో సింగిల్ కాలమ్ వార్తను ప్రచురించడం విశేషం. కానీ ఈ విషయంలో ‘సాక్షి’ పత్రిక మాత్రం అక్షరం ముక్కను కూడా తన పాఠకులకు అందించలేకపోయింది. షర్మిల రాజకీయ పార్టీపై ఆమె పుట్టింటి కుటుంబానికే చెందిన ‘సాక్షి’ పత్రికకు విషయం ఏమాత్రం పట్టకపోవడం గమనార్హం. తమిళనాడులో శశికళ తాజా రాజకీయం గురించి, కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న పల్లెప్రగతి గురించి మంగళవారం నాటి సంచికలో ప్రముఖంగా వార్తా కథనాలు అందించిన ‘సాక్షి’ షర్మిల పార్టీ ఏర్పాటు గురించిగాని, ఆమె నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశం గురించిగాని ఊసెత్తకపోవడం సహజంగానే చర్చకు దారి తీసింది. కనీసం హైదరాబాద్ ఎడిషన్ లోనూ బూతద్ధం పెట్ట వెతికినా షర్మిల సమావేశం గురించి ఎక్కడా సింగిల్ కాలమ్ వార్త కనిపించలేదు. ఈ విషయంలో ‘సాక్షి’ అనుసరిస్తున్న తీరు వ్యూహాత్మకమా? ఎత్తుగడా? ఇదీ జర్నలిస్టు సర్కిళ్లలోనే కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల్లో తలెత్తుతున్న సందేహం.